- పరకాల దామెర చెరువులో యథేచ్ఛగా తవ్వకాలు
- అధికార పార్టీ నేత అండతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా!
- మాకు పైస్థాయి అండ ఉంది అంటూ బహిరంగ ధీమా..?
- పర్మిషన్ ఉందంటూనే చూపకుండా దాపరికం
- అధికారులకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకోవడానికి ముందుకు రాని వైనం
కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా పరకాల కేంద్రంలోని దామెర చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు రోజురోజుకూ మరింత విస్తరిస్తున్నాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పరిరక్షణను పూర్తిగా విస్మరించి, నిబంధనలను పక్కనపెట్టి భారీ యంత్రాలతో చెరువు గర్భంలో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా నిరంతరం తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మట్టి రవాణా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దామెర చెరువు స్థానిక రైతులకు సాగునీటి ప్రధాన ఆధారం. అయితే విచక్షణారహితంగా జరుగుతున్న మట్టి తవ్వకాలతో చెరువు గర్భం లోతుగా మారడంతో పాటు కట్ట భద్రతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. వర్షాకాలంలో చెరువు నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెరుగుదల వంటి అంశాలపై కూడా ఈ తవ్వకాల ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ నేత అండతోనే అక్రమాలు..?
ఈ మట్టి దందా వెనుక అధికార పార్టీకి చెందిన ఓ ప్రభావశీల నేత ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయన అండదండలతోనే మట్టి మాఫియా నాయకుడు ఎలాంటి భయం లేకుండా యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నాడని చెబుతున్నారు. సంబంధిత అధికారులపై రాజకీయ ఒత్తిడి తీసుకువస్తూ అక్రమాలకు మార్గం సుగమం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చెరువులో పరిమిత స్థాయిలో మాత్రమే మట్టి తొలగించేందుకు అనుమతి తీసుకున్నప్పటికీ, ఆ అనుమతిని అడ్డం పెట్టుకుని భారీ స్థాయిలో మట్టి తవ్వి వాణిజ్యపరంగా విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అనుమతిలో పేర్కొన్న పరిమాణం కంటే అనేక రెట్లు ఎక్కువ మట్టి తరలిస్తున్నప్పటికీ అధికారులు తనిఖీలు చేయడం లేదని అంటున్నారు.
ఇరిగేషన్ అధికారుల పాత్రపై ప్రశ్నలు..
చెరువులో రోజూ భారీ యంత్రాలు పనిచేస్తున్నా, ట్రాక్టర్లతో వందలాది ట్రిప్పులు తిరుగుతున్నా సంబంధిత ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. స్థానికులు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణాలేంటని ప్రశ్నిస్తున్నారు. కొందరు అధికారులు పర్సంటేజీల కోసం మౌనంగా ఉంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు అధికారులు చెరువును సందర్శించినా, అక్రమ తవ్వకాలను అడ్డుకునే చర్యలు కనిపించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. తనిఖీలు కేవలం కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోతున్నాయని, మట్టి రవాణా మాత్రం యథావిధిగా కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు.
మాకు పైస్థాయి అండ ఉంది అంటూ బహిరంగ ధీమా..?
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొందరు కీలక నాయకులు, జిల్లా స్థాయి అధికారులు తమ వెంటే ఉన్నారని, తమపై ఎలాంటి చర్యలు ఉండవని మట్టి మాఫియా నాయకుడు బహిరంగంగానే చెబుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎవరికి చెప్పుకున్నా ఏమీ కాదు, మాకు పైస్థాయి అండ ఉంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా మట్టిని తరలించడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ, ఇతర ఆదాయాలు కూడా నష్టపోతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. అక్రమ మట్టి వ్యాపారం ద్వారా కొందరు లక్షల రూపాయలు ఆర్జిస్తుండగా ప్రభుత్వ ఖజానాకు మాత్రం నష్టం వాటిల్లుతోందని విమర్శిస్తున్నారు.
సమగ్ర విచారణకు ప్రజల డిమాండ్..!
పరకాలలోని దామెర చెరువులో ఇప్పటి వరకు ఎంత మేర మట్టి తవ్వారు, ఎవరికి అనుమతులు ఇచ్చారు, అనుమతుల ప్రకారం మాత్రమే తవ్వకాలు జరిగాయా లేదా, అక్రమ రవాణా ఎంత జరిగింది, ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి అనే అంశాలపై జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ ఉన్నతాధికారులు, విజిలెన్స్, మైనింగ్ శాఖలు సంయుక్తంగా విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన వారెవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుని దామెర చెరువును పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు.

