సోషల్ మీడియా పోస్టులపై అక్రమ కేసులు పెట్టొద్దు
ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా కాంగ్రెస్ పాలన
మాజీ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి
ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ నేతలు
కాకతీయ, ములుగు ప్రతినిధి: సోషల్ మీడియా పోస్టుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ మాజీ రెడ్కో చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు గురువారం ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కైకన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని సతీష్ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా ములుగు నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు, నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
ములుగు జిల్లా పరిధిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను రాత్రికి రాత్రే అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం చట్టవ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనుకాకుండా పోలీసులు చట్టానికి లోబడి నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఎస్పీని కోరినట్లు తెలిపారు. సోషల్ మీడియా పోస్టుల పేరుతో ఇష్టానుసారంగా కేసులు నమోదు చేయడాన్ని గతంలో తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా తప్పుబట్టాయని, భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వినతిపత్రంలో వివరించినట్లు చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న యువతను, పార్టీ కార్యకర్తలను వేధించడం ఆపాలని, ఇప్పటికే నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు కొనసాగితే జిల్లాలో పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎస్పీని కలిసిన వారిలో సానికొమ్ము రమేష్ రెడ్డి, శీలం మధు, బైకని సాగర్, నునావత్ మహేష్ నాయక్, దొడ్డపల్లి రఘుపతి, గొర్రె సమ్మయ్య, మాదం సాగర్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.

