మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
మట్టి విగ్రహాలతో నీరు, నేల కాలుష్యానికి అడ్డుకట్ట
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీలత పిలుపు
కాకతీయ, హన్మకొండ : మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల వరంగల్ వెస్ట్ ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పిలుపునిచ్చారు. ‘మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుదాం’ నినాదంతో స్వయంగా మట్టి విగ్రహాలను తయారు చేసి పలువురికి అందజేశారు. అనంతరం కళాశాల నుంచి హంటర్ రోడ్‌లోని భద్రకాళి బండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. దుకాణదారులు, ప్రజలకు మట్టి విగ్రహాల ప్రయోజనాలను వివరించారు. సింథటిక్ రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో నీరు, నేల కాలుష్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రకృతికి మేలు చేసేలా బాధ్యత నిర్వర్తించాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీలత అన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రమ వేముల, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

