ఉద్యమకారుల హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్
ప్రజా సంఘాల జెఎసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్
కాకతీయ, ఆత్మకూరు : తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కిందని ప్రజా సంఘాల జెఎసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ అన్నారు. హైదరాబాద్‌లోని అమర జ్యోతిలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్, రాములు నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా సంప్రదింపుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, గత 12 ఏళ్లుగా ఉద్యమకారులకు తగిన గుర్తింపు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో రాజకీయ నాయకులు రాజాభోగాలు అనుభవిస్తున్నారని, కానీ పోరాడిన వారిని మాత్రం ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం మేల్కొని, ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చుంచు రాజేందర్, ఆంకేశ్వరపు రామ్ చందర్ రావు, చుంచు నరేష్, జన్ను రవిందర్ తదితరులు పాల్గొన్నారు.

