అనాథ శతాధిక వృద్ధురాలికి అంత్యక్రియలు
వృద్ధాశ్రమం, ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ
శేఖర్, మధు సేవలను అభినందించిన క్షత్రియ సేవా సమితి సభ్యులు
కాకతీయ, ఏలూరు ప్రతినిధి : శ్రీ సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో ఉంటున్న శతాధిక వృద్ధురాలు కుచ్చలపాటి సూర్యకాంతమ్మ (108) మంగళవారం రాత్రి మృతి చెందారు. సూర్యకాంతమ్మ కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించకపోవడంతో, ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్, కామవరపుకోట సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు ఆధ్వర్యంలో స్థానిక హిందూ స్మశాన వాటికలో శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా అప్లాండ్ క్షత్రియ సేవా సమితి సభ్యులు దండు ధనరాజు మాట్లాడుతూ, కుటుంబ సభ్యులు ఆఖరి చూపునకు సైతం రాకపోవడం బాధాకరమని, అభాగ్యులకు సేవలందిస్తూ అంత్యక్రియలు చేస్తున్న శేఖర్, మధులను అభినందించారు. వృద్ధులు, వికలాంగులకు ప్రతి ఒక్కరూ ఆసరాగా నిలవాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేకూరి శ్రీనివాసరాజు, కాలేజీ సత్యనారాయణ రాజు, వేగేసిన రామరాజు, పొత్తూరి సుబ్బరాజు, కోలనువాడ శ్రీనివాసరాజు, పేరిచర్ల సత్యనారాయణ రాజు, శ్రీనివాసరాజు, వీరమల్ల సౌజన్ తదితరులు పాల్గొన్నారు.

