ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బీజేపీ
దేశంలో ఫాసిస్ట్ పరిపాలన కొనసాగుతోంది
హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి
రాహుల్ గాంధీపై దాడి, నీట్ లీకేజీపై హన్మకొండలో కాంగ్రెస్ భారీ నిరసన
ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసిన శ్రేణులు
కాకతీయ, వరంగల్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ ఫాసిస్ట్ పాలనకు పాల్పడుతోందని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏఐసీసీ, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు బుధవారం హనుమకొండలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో ఆయన ప్రధానంగా మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీపై పార్లమెంట్‌లోనూ, ప్రజాక్షేత్రంలోనూ గళమెత్తుతున్న రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్టు చేసి, ముక్కు నుంచి రక్తం వచ్చేలా పోలీసులు ఈడ్చుకువెళ్లడం దుర్మార్గమని ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర ప్రభుత్వం, దీనికి నైతిక బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీసీసీ భవన్ వద్ద ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసిన అనంతరం, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. మోదీ ప్రభుత్వం ఎన్ని అణచివేత చర్యలకు పాల్పడినా, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్. నాగరాజుతో పాటు పలువురు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


