- ప్రత్యామ్నాయ పంటలపై రైతులను చైతన్యపరచాలి
- వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద
కాకతీయ, నల్లబెల్లి : ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులకు ప్రత్యామ్నాయ, ఆరుతడి పంటల సాగుపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం మేడపల్లి రైతు వేదికను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె, రైతులకు అందుతున్న సేవలు, వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలను సమీక్షించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో సాగయ్యే పంటల సాగుపై రైతులను చైతన్యపరచాలని, క్షేత్రస్థాయి అధికారులు గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, సాగు విధానాలు, నీటి యాజమాన్యంపై రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు ఎప్పటికప్పుడు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త రాజ్‌కుమార్, ఏడీఏ రవీందర్, ఏవో రజిత, ఏఈవో రంజిత్ పాల్గొన్నారు.

