జెన్ జీ కోటా.. క్యాబినెట్ సీటా..?
మంత్రివర్గ రేసులోకి జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
యువ ఎమ్మెల్యేలకు అవకాశం పేరుతో అధిష్టానం దృష్టిని ఆకర్షించే యత్నం
రెడ్డి సామాజికవర్గంలోనే మంత్రి పదవికి పెరుగుతున్న పోటీ
పంచాయతీ ఎన్నికల ఫలితాలపై విమర్శలు ఇంకా వెంటాడుతూనే…
పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలతో వార్తల్లో.. ఇప్పుడు మంత్రి పదవిపై గురి
జెన్ జీ నినాదానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
కాకతీయ,తెలంగాణ బ్యూరో : రేవంత్ సర్కారులో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతున్న కొద్దీ ఆశావహుల జాబితా కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సామాజిక సమీకరణాల్లో బలమైన నేతలు మంత్రి పదవుల కోసం లాబీయింగ్ చేస్తున్న వేళ.. తాజాగా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కూడా తన పేరు రేసులోకి తీసుకొచ్చే ప్రయత్నం ప్రారంభించారు. యువ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని ఆయన బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. బయటకు చూస్తే యువ నాయకత్వానికి మద్దతుగా చేసిన వ్యాఖ్యల్లా కనిపిస్తున్నా.. అసలు ఉద్దేశం మాత్రం రాబోయే క్యాబినెట్ విస్తరణలో తనకు చోటు కల్పించాలని అధిష్టానానికి సంకేతాలు పంపడమేనన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ, ప్రక్షాళన ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే యువ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలని, కొత్త రక్తాన్ని మంత్రివర్గంలోకి తీసుకురావాలని అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇటీవల రాష్ట్రంలో యువత, విద్యార్థులకు సంబంధించిన అంశాలు రాజకీయ చర్చగా మారిన వేళ.. అదే “జెన్ జీ” భావనను తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నమే ఈ వ్యాఖ్యల వెనుక ఉందన్న విశ్లేషణ వినిపిస్తోంది.
రేసులో సీనియర్లు.. మధ్యలో అనిరుధ్
కాంగ్రెస్‌లో మంత్రి పదవి అంటే కేవలం యువకుడిననే కారణంతో దక్కేది కాదని పార్టీ నేతలే చెబుతున్నారు. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, పార్టీ కోసం చేసిన సేవలు, రాజకీయ ప్రభావం, అధిష్టానానికి దగ్గరితనం వంటి అనేక అంశాల ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే రెడ్డి సామాజికవర్గం నుంచే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, బోధన్ సుదర్శన్ రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అలాంటి పోటీలో ఇప్పుడు జనంపల్లి అనిరుధ్ రెడ్డి కూడా తన అవకాశాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. యువ నాయకత్వం పాలనలో వేగం పెంచుతుందని, ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థంగా చేరవేయగలదని అనిరుధ్ రెడ్డి చెబుతున్నప్పటికీ.. కాంగ్రెస్‌లో మంత్రి పదవుల కేటాయింపులో కేవలం వయసు ప్రమాణం కాదనే అభిప్రాయం బలంగా ఉంది. అందుకే “జెన్ జీ” కార్డు ఎంతవరకు పనిచేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
విమర్శల మధ్య మంత్రి పదవి ఆశలు
జనంపల్లి అనిరుధ్ రెడ్డి రాజకీయ ప్రయాణంపై కాంగ్రెస్‌లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సొంత గ్రామంలోనే పార్టీకి ఆశించిన ఫలితాలు తీసుకురాలేకపోయారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనే మంత్రి పదవిపై బహిరంగంగా సంకేతాలు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. మరోవైపు రాష్ట్ర సమస్యల కంటే తరచూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని చేసే వ్యాఖ్యల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. తెలంగాణ రాజకీయాల కంటే ఆంధ్రా సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే ప్రచారం పొందేందుకు ప్రయత్నిస్తారనే ఆరోపణలు ప్రత్యర్థుల నుంచే కాకుండా కాంగ్రెస్‌లోని కొందరి నుంచీ వినిపిస్తున్నాయి. అయితే అనిరుధ్ రెడ్డి మాత్రం తాను అధిష్టానం నిర్ణయానికే కట్టుబడి ఉంటానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ నాయకత్వం ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. రాజకీయాల్లో ఇలాంటి ప్రకటనలు సహజమే అయినప్పటికీ.. వాటి వెనుక మంత్రి పదవిపై ఆసక్తి స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం అధిష్టానం చేతుల్లోనే ఉన్నా.. ఆశావహుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. అందులో ఇప్పుడు జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేరు కూడా చేరింది. అయితే “జెన్ జీ” నినాదం అధిష్టానాన్ని ఆకట్టుకుంటుందా.. లేక అనుభవం, రాజకీయ సమీకరణాలకే మరోసారి పెద్దపీట వేస్తుందా అన్నదే ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆసక్తికర చర్చగా మారింది.

