- స్థానిక యువతకు వెయ్యి ఉద్యోగాలు కల్పించాలి
- కేంద్రమంత్రికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి
కాకతీయ, మల్హర్ : తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, స్థానిక యువతకు కనీసం వెయ్యి ఉద్యోగాలు కల్పించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కోరారు. తెలంగాణ గనులు, కార్మిక శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామితో కలిసి మంగళవారం న్యూఢిల్లీలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రాజెక్టు ప్రభావిత కుటుంబాలకు సమగ్ర పునరావాసం కల్పించడంతో పాటు సింగరేణి పదవీ విరమణ పొందిన కార్మికులకు కనీసం రూ.10 వేల నెలవారీ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సింగరేణి అభివృద్ధి, గనుల విస్తరణ, ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై కూడా చర్చించారు. ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి సంబంధిత శాఖలతో చర్చించి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు.

