- గ్రామ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణరావు
- వర్షపు నీటి తొలగింపునకు తక్షణ చర్యలు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్: భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రామ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణరావు సూచించారు. బుధవారం ఏటూరునాగారం మండల కేంద్రంలోని 4వ వార్డును సందర్శించిన ఆమె వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించి, తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జేసీబీతో ట్రెంచ్ తవ్వించి నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టడంతో పాటు, ఇరిగేషన్ ఏఈ రాజుతో మాట్లాడి కరకట్ట గేట్లను తెరిపించారు. వర్షాకాలం ముగిసే వరకు కాచి చల్లార్చిన నీటినే తాగాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సర్పంచ్ ప్రజలకు సూచించారు. గ్రామంలోని అన్ని వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేయించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు రాజు, మాదరి మధు, చిన్ని, బాబా, గ్రామ పంచాయతీ సిబ్బంది మినాజ్, రాంబాబు, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

