డేంజర్ జోన్ నుంచి వెంటనే తరలించాలి
నిజమైన నిర్వాసితులను గుర్తించి న్యాయం చేయాలి
తాడిచెర్ల భూనిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు దండు రమేష్
కాకతీయ, మలహర్: తాడిచెర్ల టీఎస్ జెన్కో ఉపరితల బొగ్గుగని డేంజర్ జోన్లో నివసిస్తున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి న్యాయం చేయాలని తాడిచెర్ల–కాపురం టీఎస్ జెన్కో భూనిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు, తెలంగాణ ఈజీసీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు దండు రమేష్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన డేంజర్ జోన్ సర్వేను గ్రామ సర్పంచ్ బండి స్వామితో కలిసి ఆయన పరిశీలించారు. దశాబ్దకాలంగా బొగ్గు తవ్వకాల కారణంగా దుమ్ము, కాలుష్యం, బ్లాస్టింగ్‌తో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఇళ్లకు పగుళ్లు ఏర్పడి ప్రాణభయంతో జీవిస్తున్నామని తెలిపారు. గత తొమ్మిదేళ్లుగా నిర్వాసితుల కోసం పోరాటం చేస్తున్నామని, గత ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్నామని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇచ్చిన హామీ మేరకు టీఎస్ జెన్కోతో చర్చించి నిధులు జమ చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో డేంజర్ జోన్లో చాలాకాలంగా నివసిస్తున్న నిజమైన బాధితులను గుర్తించి న్యాయం చేయాలని సర్వే అధికారులను కోరారు.

