ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఘనంగా ర్యాలీ
సంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలతో ఆకట్టుకున్న ఆదివాసీలు
కాకతీయ, ఏటూరునాగారం రూరల్: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏటూరునాగారం మండల కేంద్రంలో ఆదివారం ఆదివాసీలు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. వై జంక్షన్లోని కొమురం భీమ్ జంక్షన్ నుంచి ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. సంప్రదాయ దుస్తులు ధరించిన ఆదివాసీలు నృత్యాలు చేస్తూ, వాయిద్యాలు వాయిస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించేలా ర్యాలీ కొనసాగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనడంతో ప్రధాన రహదారి సందడిగా మారింది. ఆదివాసీ హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలనే సందేశాన్ని ర్యాలీ ద్వారా చాటిచెప్పారు.


