ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు!
నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అడ్డగోలు వ్యవహారం?
2 మండలాల్లో పంచాయతీ కార్యదర్శుల సంతకాలు ఫోర్జరీ, నకిలీ స్టాంపులు?
ఇళ్లు, భూములు రిజిస్ట్రేషన్.. ఆపై రుణాలు
కార్యాలయంలో పెరిగిన రైటర్ల పెత్తనం
డీఆర్ విచారణకు ఆదేశించేనా..? ఆడిట్ జరిగేనా..?!!
కాకతీయ, వరంగల్ బ్యూరో : నర్సంపేట సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ స్టాంపులతో పత్రాలు సృష్టించి ఇళ్లు, భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇద్దరు డాక్యుమెంట్ రైటర్లు డివిజన్‌లోని 2 మండలాలకు చెందిన పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శుల స్టాంపులను దొంగచాటుగా తయారు చేసి, వారి సంతకాలను పోలిన ఫోర్జరీ సంతకాలతో పత్రాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఆ పత్రాల ఆధారంగా ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించడంతోపాటు, అనంతరం వాటిపై రుణాలు ఇప్పించి లక్షల రూపాయలు పొందుతున్న వ్యవహారం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. నకిలీ స్టాంపులు, సంతకాలతో కూడిన పత్రాలు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుతున్నా వాటి ప్రామాణికతను అధికారులు గుర్తించకపోవడం ఎలా సాధ్యమన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

పంచాయతీ కార్యదర్శుల స్టాంపులే నకిలీ?
2 మండలాల్లోని పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శుల పేర్లతో ఉన్న స్టాంపులను పోలిన నకిలీ స్టాంపులు తయారు చేసి వినియోగిస్తున్న వ్యవహారం అత్యంత తీవ్రమైన అంశంగా మారింది. పంచాయతీల నుంచి జారీ చేసినట్లు చూపిస్తున్న ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్ పత్రాల్లోకి వస్తున్నప్పుడు వాటి వివరాలను సంబంధిత పంచాయతీ కార్యదర్శుల రికార్డులతో ఎందుకు సరిపోల్చలేదు? స్టాంపు, సంతకం నిజమైనవేనా? ధ్రువపత్రం వాస్తవంగా పంచాయతీ నుంచే జారీ అయిందా? అన్నది పరిశీలించాల్సిన బాధ్యత ఎవరిది? నకిలీ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరిగి ఉంటే వాటిని గుర్తించడంలో కార్యాలయ స్థాయిలో ఎక్కడ లోపం జరిగిందన్నది తేలాల్సి ఉంది.
ఇళ్లు, భూములు రిజిస్ట్రేషన్.. ఆపై లోన్లు!
ఫోర్జరీ పత్రాలతో ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయించి, అదే పత్రాలను ఆధారంగా చేసుకుని బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందుతున్న వ్యవహారం ఉన్నట్లు సమాచారం. ఒక ఆస్తికి సంబంధించిన పత్రం నకిలీదైతే దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ ఎలా పూర్తయింది? రిజిస్ట్రేషన్ తర్వాత రుణం కోసం సమర్పించినప్పుడు పత్రాల ప్రామాణికతను ఎవరు పరిశీలించారు? ఇలాంటి వ్యవహారాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయం, పంచాయతీ, రుణం మంజూరు చేసిన సంస్థల మధ్య ఉన్న పత్రాలను సరిపోల్చితే మొత్తం వ్యవహారం బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే జరిగిన అనుమానాస్పద రిజిస్ట్రేషన్లను గుర్తించి వాటిపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది.
సబ్‌రిజిస్ట్రార్‌కు తెలియకుండానే ఇంత తతంగమా?
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పత్రాల పరిశీలన, ఆస్తి హక్కుల నిర్ధారణ, సంబంధిత వ్యక్తుల గుర్తింపు, బయోమెట్రిక్, ఫొటోలు, ఇతర ధ్రువీకరణలు కీలకం. అలాంటి ప్రక్రియలో ఫోర్జరీ సంతకాలు, నకిలీ స్టాంపులతో పత్రాలు సమర్పించి రిజిస్ట్రేషన్లు పూర్తయితే సబ్‌రిజిస్ట్రార్ స్థాయిలో పరిశీలన ఎలా జరిగింది? అధికారికి తెలియకుండానే రైటర్లు ఇంతటి వ్యవహారం నడపగలరా? తెలిసి ఉంటే ఎందుకు అడ్డుకోలేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్ల ప్రభావం పెరిగి, వారి ద్వారా వచ్చే వ్యవహారాలు సులభంగా పూర్తవుతున్నాయన్న చర్చకు ఈ పరిణామాలు మరింత బలం చేకూరుస్తున్నాయి.
ప్రైవేట్ వ్యక్తుల హవా.. అదనపు వసూళ్లు
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ప్రజల నుంచి పత్రాలు తీసుకోవడం, పనులు చేయిస్తామని చెప్పడం, అధికారులను కలవకుండా మధ్యవర్తిత్వం చేయడం వంటి వ్యవహారాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఒక్కో పనికి రూ.100 నుంచి రూ.1,000 వరకు అదనంగా వసూలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రభుత్వ రుసుములతో పాటు ఈ అదనపు మొత్తాలు ఎందుకు తీసుకుంటున్నారు? వాటికి రసీదులు ఇస్తున్నారా? కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తుల జోక్యాన్ని సబ్‌రిజిస్ట్రార్ ఎందుకు నియంత్రించడం లేదు? అన్నది తేలాల్సి ఉంది.
డీఆర్ గారూ.. మీ నిఘా ఎక్కడ?
నర్సంపేట కార్యాలయంలో ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు సమాచారం ఉన్న నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది. గతంలో జరిగిన రిజిస్ట్రేషన్లలో పంచాయతీ కార్యదర్శుల ధ్రువపత్రాలు, స్టాంపులు, సంతకాలను ఆయా పంచాయతీ రికార్డులతో సరిపోల్చాలి. రిజిస్ట్రేషన్ సమయంలో తీసిన ఫొటోలు, బయోమెట్రిక్, వీడియో రికార్డింగ్, డాక్యుమెంట్ రైటర్ల వివరాలు పరిశీలించాలి. ఫోర్జరీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు జరిగితే బాధ్యులెవరు? సబ్‌రిజిస్ట్రార్ స్థాయిలో పరిశీలన ఎందుకు విఫలమైంది? ఇంతకాలం డీఆర్, ఉన్నతాధికారుల తనిఖీల్లో ఈ వ్యవహారం ఎందుకు బయటపడలేదు? అన్న ప్రశ్నలకు సమాధానం రావాలి. నకిలీ పత్రాలతో జరిగిన రిజిస్ట్రేషన్లను గుర్తించి, వాటి వెనుక ఉన్న వ్యక్తులను బయటకు తీసి, సంబంధిత అధికారుల బాధ్యతను తేల్చాల్సిన అవసరం ఉంది.

