నేను చెప్పిందే వేదం..నా మాటే శాసనం’
ఇష్టారాజ్యంగా ములుగు డీటీవో ఈశ్వర్ సింగ్ విధులు
యూనిఫాం పక్కన పెట్టి బనీన్‌పైనే డ్యూటీ
ఇప్పటికే సార్‌పై అవినీతి ఆరోపణల వెల్లువ
సెలవు రోజుల్లోనూ సార్ సైన్‌తో లైసెన్స్, సర్టిఫికెట్లు జారీ
ఆధారాలతో బయటపెట్టిన కాకతీయ.. అయినా డీటీవోపై నో యాక్షన్
డ్రైవింగ్ టెస్టులోనూ ‘ముడుపులు’ ఇస్తేనే పాస్?
రవాణా శాఖ అధికారి తీరుపై విమర్శలు
సార్ బాగోతాలపై కాకతీయ ప్రతినిధికి ఫోన్లు..!
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా రవాణా శాఖ కార్యాలయం పెద్ద సారు నేను చెప్పిందే వేదం, నా మాట వినకుంటే బతుకులు చిద్రమే అన్న తీరు గా వ్యవహరిస్తూ కార్యాలయంలో అర్థనగ్నంగా డ్యూటీ చేయడం అటు కార్యాలయ సిబ్బంది లోను, ఇటు వాహనదారుల నుండి తీవ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారాలు జరుగుతున్నాయంటూ దరఖాస్తుదారులు, వాహనదారులు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ) ఠాకూర్ ఈశ్వర్‌సింగ్ వ్యవహారశైలిపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బ్రోకర్లను కలిస్తేనే పని ముందుకు…?
ములుగు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో నిబంధనల ప్రకారం దరఖాస్తుల పరిశీలన జరగాల్సి ఉంటుంది. అవసరమైన పత్రాలు సక్రమంగా లేకుంటే సంబంధిత అధికారులు వాటిని తిరస్కరించడం లేదా లోపాలను సరిచేయాలని సూచించడం సాధారణ ప్రక్రియ. అయితే ములుగు కార్యాలయంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని పలువురు దరఖాస్తుదారులు ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో తమకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్న బ్రోకర్లను ఆశ్రయిస్తేనే పనులు సులభంగా పూర్తవుతున్నాయని, లేదంటే దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నాయని వారు చెబుతున్నారు. సరైన పత్రాలు లేని దరఖాస్తులను సైతం ముందుకు తీసుకెళ్లాలని కింది స్థాయి సిబ్బందిపై డి టి ఓ ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సిబ్బందిపై ఒత్తిళ్లంటూ ఆరోపణలు
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న దరఖాస్తులను తిరస్కరించే కింది స్థాయి ఉద్యోగులు పైస్థాయి నుంచి వచ్చే ఆదేశాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్యాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అధికారి ఆదేశాలను పాటించకపోతే కక్షసాధింపు చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో కొందరు ఉద్యోగులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కార్యాలయంలో కిందిస్థాయి ఉద్యోగులను దుర్భాషలాడుతూ చిన్నా పెద్ద తప్పులని చూడకుండా వారి పై ఇష్టం వచ్చినట్టు కార్యాలయంలో అందరి ముందు కేకలు వేయటం, ఏది ఏమైనా నేను చెప్పింది చేయాల్సిందే లేకుంటే మీకు బతుకు ఉండదు అని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని సిబ్బంది కూడా సదరు ఉన్నతాధికారిపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది.
అర్ధనగ్నంగా డ్యూటీ..!
ములుగు జిల్లా రవాణా శాఖ అధికారులకు విధి నిర్వహణలో యూనిఫామ్ నిబంధనలు పక్కన పెడితే కనీసం పూర్తిగా దుస్తులు ధరించకుండా ఒంటిపై బనియన్ తో అర్థనగ్నంగా ములుగు డీటీఓ కార్యాలయంలో డ్యూటీ చేయటంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రవాణా శాఖ కార్యాలయంలో పనిపై పురుషులతోపాటు స్త్రీలు ధ్రువపత్రాల కోసం కార్యాలయానికి వస్తుంటారు. అయితే డ్యూటీ సమయంలో కనీసం సాధారణ దుస్తుల్లోనైనా ఉండాల్సిన అధికారి కార్యాలయంలో యూనిఫామ్ లేకుండా, మర్యాదపూర్వకమైన దుస్తులు కూడా లేకుండా విధులు నిర్వహిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కార్యాలయానికి వచ్చే ప్రజల తో పాటు సిబ్బంది ముందు అధికారి హోదాకు తగిన విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ బాధ్యత గల కుర్చీలో కూర్చొని బనియన్ పై అర్థనగ్నంగా డ్యూటీ చేయడం పై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
‘లాగిన్’ వ్యవహారంపై ఏమైంది.?
ఇటీవల ములుగు రవాణా శాఖలో డీటీఓ లాగిన్ ఐడీ, డిజిటల్ సంతకం వినియోగానికి సంబంధించిన వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. అధికారి విధుల్లో లేని సమయంలో ఆయన పేరుతో డిజిటల్ సంతకాలతో ధ్రువపత్రాలు జారీ అయ్యాయనే ఆరోపణలు ఇప్పటికే ప్రశ్నలను లేవనెత్తాయి. ఈ వ్యవహారంపై సెప్టెంబర్ 2న డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) వివరణ కోరినట్లు సమాచారం. అయితే దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేత ధోరణిలో వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు అధికారిక లాగిన్ వివరాలు ఎవరి వద్ద ఉన్నాయి? డిజిటల్ సంతకాన్ని ఎవరు వినియోగించారు? అధికారి విధుల్లో లేని సమయంలో ఆయన పేరుతో ధ్రువపత్రాలు ఎలా జారీ అయ్యాయి? అన్న ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.
ఉన్నతాధికారుల మౌనం ఎందుకు?
ములుగు రవాణా శాఖ కార్యాలయంపై వరుసగా ఆరోపణలు వస్తున్నా ఉన్నతాధికారులు మాత్రం ఇప్పటివరకు సమగ్ర విచారణకు ఆదేశించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. లాగిన్, డిజిటల్ సంతకాల వ్యవహారం నుంచి మొదలుకొని బ్రోకర్ల ద్వారా పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలు, డ్రైవింగ్ టెస్టులపై అనుమానాలు, అధికారిపై వస్తున్న ఆస్తుల ఆరోపణలు.. ఇలా అనేక అంశాలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో శాఖాపరమైన విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉంది.
‘ఎవరికి వాటాలు….?’
ఇన్ని ఆరోపణలు వస్తున్నా చర్యలు ఎందుకు లేవన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. అవినీతి ఆరోపణలపై అధికారులు ఎందుకు స్పందించడం లేదు? ఫిర్యాదులపై విచారణ ఎందుకు జరగడం లేదు? అనే ప్రశ్నలు వాహనదారుల నుంచి వినిపిస్తున్నాయి. ‘అక్రమంగా సంపాదిస్తున్న సొమ్ములో ఉన్నతాధికారులకు కూడా వాటాలు ఉన్నాయా?’ అంటూ జిల్లా ప్రజల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అనుమానాలకు తెరపడాలంటే ఉన్నతాధికారులు స్వతంత్రంగా విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ములుగు రవాణా శాఖ కార్యాలయంలో జరుగుతున్నాయంటూ వస్తున్న ఆరోపణలన్నింటిపైనా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వాహనదారులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లాగిన్ వినియోగం, డిజిటల్ సంతకాలు, డ్రైవింగ్ లైసెన్సుల జారీ, బ్రోకర్ల వ్యవహారం, దరఖాస్తుల పెండింగ్, అధికారిపై వచ్చిన ఆస్తుల ఆరోపణలు.. ఇలా ప్రతి అంశాన్ని పరిశీలించి తప్పు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

