పెద్ది విగ్రహ గద్దె కూల్చివేత!.. నర్సంపేటలో హైటెన్షన్
అనుమతి లేదంటూ.. మెడికల్ కాలేజీ ఎదుట నిర్మించిన గద్దె తొలగింపు
రాత్రివేళ మున్సిపల్ సిబ్బంది చర్య.. అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ నేతలు
కక్ష సాధింపులో భాగమేనంటూ బీఆర్‌ఎస్ ఆరోపణలు
కాకతీయ, నర్సంపేట : దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నిర్మించిన గద్దెను నర్సంపేట మున్సిపాలిటీ అధికారులు ఆదివారం రాత్రి కూల్చివేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు గద్దె నిర్మించినప్పటికీ, సంబంధిత అనుమతులు లేవంటూ అధికారులు తొలగించినట్లు సమాచారం. రాత్రి వేళ గద్దెను కూల్చివేయడంతో విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ స్థలంలో గద్దె నిర్మిస్తే దానిని అధికారులు రాత్రివేళ తొలగించడంపై బీఆర్‌ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే గద్దెను కూల్చివేశారని ఆరోపించారు. ఈ ఘటనతో నర్సంపేటలో రాజకీయంగా చర్చ మొదలైంది. గద్దె నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? లేవా? మున్సిపాలిటీ అధికారులు ఏ నిబంధనల ఆధారంగా చర్యలు తీసుకున్నారు? అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అధికారులు నిబంధనల ప్రకారమే కూల్చివేత చేపట్టారా? లేక రాజకీయ కక్షతోనే చర్యలకు దిగారా? అనే చర్చ స్థానికంగా సాగుతోంది.

