సమస్యలు పరిష్కారం కావు.. సమావేశాలు ఎందుకు?
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు లేవు
కాలువల పూడికతో చివరి ఆయకట్టుకు అందని నీరు
మూడు నెలలకోసారి సమావేశం.. పరిష్కారాలు మాత్రం శూన్యం
పెద్దవంగర మండల అధికారుల గైర్హాజరుపై ప్రజాప్రతినిధుల అసహనం
కాకతీయ, పెద్దవంగర : సమస్యలు పరిష్కారం కానప్పుడు సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం ఎందుకని పలువురు ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. మూడు నెలలకోసారి జరిగే సమావేశాలకు పూర్తిస్థాయిలో అధికారులు హాజరు కావడం లేదని, వచ్చినా గత సమావేశాల్లో ప్రస్తావించిన సమస్యలకు పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దవంగర రైతు వేదికలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో సురేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు పలు శాఖల అధికారులను సమస్యలపై నిలదీశారు. బొమ్మకల్, వడ్డేకొత్తపల్లి గ్రామాల్లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు లేవని ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు. కిష్టు తండాలో తాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు.
రోడ్లు, తాగునీటిపై చర్చ
పలు ప్రాంతాల్లో తాగునీరు, సైడ్ డ్రైనేజీల సమస్యలు ఉన్నాయని ప్రజాప్రతినిధులు తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. రహదారులు, పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి పలు రోడ్లు మంజూరైనట్లు ఆయా శాఖల అధికారులు వివరించారు. ఎస్సారెస్పీ కాలువలో పూడిక పేరుకుపోవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందడం లేదని ఉపసర్పంచ్ సీతారాం సమావేశంలో ప్రస్తావించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరగా, ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారి సమాధానం ఇచ్చారు. ప్రతి రైతు పంట మార్పిడి విధానాన్ని పాటించాలని మండల వ్యవసాయ అధికారి స్వామినాయక్ సూచించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, పీఆర్ఏఈ దయాకర్, ఏఓ స్వామినాయక్, నీటిపారుదల శాఖ ఏఈ, సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

