మోహన్‌లాల్ కూతురు ‘తుడక్కం’తో దుమ్మురేపుతోంది!
విస్మయ తొలి సినిమాకే భారీ వసూళ్లు
ఆరు రోజుల్లో రూ.30 కోట్లకు పైగా గ్రాస్
కేరళలో రూ.15 కోట్లు.. ఓవర్సీస్‌లో మరో రూ.15 కోట్లు
కాకతీయ,సినిమా : మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నట వారసులుగా ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్, కుమార్తె విస్మయ మోహన్‌లాల్ వెండితెరకు పరిచయమయ్యారు. గతేడాది ప్రణవ్ హారర్ చిత్రం ‘డీయస్ ఈరే’తో ఆకట్టుకోగా.. ఈ ఏడాది విస్మయ ‘తుడక్కం’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్, సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. దర్శకుడు జాడే ఆంథని జోసెఫ్ తెరకెక్కించిన ‘తుడక్కం’ కేరళతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ వసూళ్ల జోరు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విడుదలైన ఆరు రోజుల్లో కేరళలోనే సుమారు రూ.15 కోట్ల గ్రాస్ సాధించినట్లు సమాచారం. ఓవర్సీస్ మార్కెట్‌లో మరో రూ.15 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో విస్మయ తొలి చిత్రమే ఆరు రోజుల్లో రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. రోజురోజుకూ వసూళ్లు పెరుగుతుండటంతో ఈ సినిమా లాంగ్‌రన్‌లో మరింత దూసుకెళ్లే అవకాశముందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఫుల్ రన్‌లో ‘తుడక్కం’ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.

