శాలరీ ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవాలి
ఉద్యోగులకు ఎస్బీఐ శాలరీ ప్యాకేజీపై అవగాహన
బీమా, పెన్షన్, రుణ రాయితీలను వినియోగించుకోవాలి
ఆర్థిక భద్రతకు శాలరీ ప్యాకేజీ దోహదం
అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో మరింత అవగాహన
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న శాలరీ ప్యాకేజీ ప్రయోజనాలను ఉద్యోగులు పూర్తిగా అర్థం చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న సూచించారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సులో ఎస్బీఐ చీఫ్ మేనేజర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ప్రతినిధి అనిరుధ్ జనక్ నేతృత్వంలోని బ్యాంకు అధికారులు శాలరీ ప్యాకేజీ ప్రయోజనాలను దృశ్యమాధ్యమం ద్వారా వివరించారు. జీరో బ్యాలెన్స్ శాలరీ ఖాతా, ఆరోగ్య బీమా, పెన్షన్ ప్రయోజనాలు, రుణాలపై రాయితీలు, ఇతర బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించారు. కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ ఉద్యోగుల ఆర్థిక భద్రత, సంక్షేమానికి శాలరీ ప్యాకేజీ దోహదపడుతుందని అన్నారు. ముఖ్యంగా ప్రమాదాలు, అనుకోని పరిస్థితుల్లో బీమా ప్రయోజనాలు ఉద్యోగులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని తెలిపారు. ఉద్యోగులందరికీ ప్యాకేజీపై మరింత అవగాహన కల్పించేందుకు అదనపు కమిషనర్ ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, ఎస్‌ఈ రాజ్‌కుమార్, ఇన్‌చార్జి సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఇన్‌చార్జి సీహెచ్‌వో లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, పన్నుల అధికారి రామకృష్ణ, ఎస్బీఐ జీడబ్ల్యూఎంసీ బ్రాంచ్ మేనేజర్ శ్రావణ్, బ్యాంకు అధికారులు, బల్దియా ఉద్యోగులు పాల్గొన్నారు.

