అడగొద్దు మెనూ .. పెట్టింది తిను..
ప్రభుత్వం నిర్దేశించిన మెనూకు తూట్లు
సాంబార్ స్థానంలో చింతపండు చారు.. ఆకుకూర పప్పుకు పంగనామం
డయాలసిస్ రోగులు, బాలింతలకు భోజనం అందించడంలోనూ నిర్లక్ష్యం
ప్రశ్నిస్తే దురుసు సమాధానాలు
నాణ్యత ప్రమాణాలపై కరవైన పట్టింపు
గుత్తేదారు తీరుపై ఆరోపణలు
చర్యలు చేపట్టాలంటున్న రోగులు
కాకతీయ, ఏటూరునాగారం : రోగులకు వైద్యం ఎంత ముఖ్యమో.. చికిత్స సమయంలో సమయానికి నాణ్యమైన పౌష్టికాహారం అందించడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా డయాలసిస్ రోగులు, బాలింతలకు ఆహారంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావులేదు. రోగుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించాల్సిన ఆహారానికి ప్రభుత్వం సమయాలు, పరిమాణాలతో సహా స్పష్టమైన మెనూను నిర్దేశించింది. ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య 150 గ్రాముల ఇడ్లీ–3, సాంబార్/చట్నీ 100 మి.లీ., పొంగల్/కిచిడీ/ఉప్మా 300 గ్రాములు, మినపప్పు–చట్నీ/బ్రెడ్ 100 గ్రాములు, పాలు 150 మి.లీ., గుడ్డు ఒకటి ఇవ్వాలి. మధ్యాహ్నం 12 నుంచి 1 గంటలోపు 450 గ్రాముల అన్నం/6 అంగుళాల పుల్కా, కూరగాయల కూర 50 గ్రాములు, ఆకుకూరల పప్పు 100 గ్రాములు, సాంబార్ 150 మి.లీ., గుడ్డు, పెరుగు/మజ్జిగ 100 మి.లీ., అరటిపండుతో పాటు సాయంత్రం చిక్కీ 50 గ్రాములు/ఉడికించిన పల్లి 20 గ్రాములు అందించాలి. రాత్రి 6 నుంచి 8 గంటల మధ్య 450 గ్రాముల అన్నం/పుల్కా, కూరగాయల కుర్మా 100 గ్రాములు, సాంబార్ 150 మి.లీ., ఆకుకూరల పప్పు 50 గ్రాములు, గుడ్డు, పెరుగు/మజ్జిగ 100 మి.లీ. ఇవ్వాల్సి ఉంది. అయితే ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నిబంధనలు అమలు కావడం లేదని పలువురు రోగులు, బంధువుల నుంచి ‘కాకతీయ’కు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని నిర్ధారించుకునేందుకు ఆసుపత్రిలో పరిశీలించగా.. మెనూ బోర్డుపై ఉన్న నిబంధనలకు, రోగుల ప్లేట్లలో వడ్డిస్తున్న భోజనానికి పొంతనే లేకపోవడం స్పష్టమైంది.
సాంబార్ స్థానంలో చింతపండు చారు.. పప్పుకు పంగనామం
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం మధ్యాహ్నం, రాత్రి భోజనంలో సాంబార్, ఆకుకూరల పప్పు, కూరగాయల కూర/కుర్మా, గుడ్డు, పెరుగు లేదా మజ్జిగ ఉండాలి. కానీ ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో సాంబార్‌కు బదులుగా చింతపండు చారు వడ్డిస్తున్నారు. ఆకుకూరల పప్పు అందించడం లేదు. పెరుగు లేదా మజ్జిగ కూడా క్రమం తప్పకుండా ఇవ్వడం లేదు. మెనూలో పేర్కొన్న పౌష్టిక పదార్థాలను పక్కనపెట్టి అన్నం, చారు, ఒక కూరతోనే భోజనం ముగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రోగులు త్వరగా కోలుకునేందుకు అవసరమైన పోషకాలు అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్దేశించిన మెనూకే కోతలు పడుతుండటంపై రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాల్సిన చోట నామమాత్రపు భోజనంతో సరిపెట్టడం.. రోగుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన విధానాన్ని నీరుగారుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భోజనం పంపిణీలోనూ నిర్లక్ష్యం
ఈ పరిస్థితికి తోడు డయాలసిస్ రోగులు, బాలింతలకు వారి బెడ్ వద్దకే భోజనం అందించాల్సి ఉండగా.. ఈ విధానం సక్రమంగా అమలు కావడం లేదని రోగుల బంధువులు చెబుతున్నారు. రోగి తరఫున ఎవరైనా వచ్చి ఆహారం తీసుకెళ్తే అందిస్తున్నారని.. ఎవరూ రాకపోతే వారికి భోజనం అందని పరిస్థితి ఉంటోందని ఆరోపిస్తున్నారు. స్వయంగా లేచి వెళ్లలేని రోగుల వద్దకు సిబ్బందే భోజనం తీసుకెళ్లాల్సి ఉన్నా.. బంధువు వస్తేనే ఆహారం చేరే పరిస్థితి నెలకొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రోగికి అందాల్సిన భోజనం కోసం కూడా బంధువులే పరుగులు తీయాల్సి వస్తుండటంతో.. ఆసుపత్రి సేవల పర్యవేక్షణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


తింటే తినండి.. లేకపోతే మీ ఇష్టం
మెనూ ప్రకారం భోజనం ఎందుకు అందించడం లేదని ప్రశ్నించిన రోగులు, వారి బంధువులకు నిర్వాహకుల నుంచి దురుసు సమాధానాలు ఎదురవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. “ఇక్కడ ఇలాగే ఉంటుంది.. తినండి.. లేకపోతే మీ ఇష్టం” అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని పలువురు వాపోతున్నారు. భోజన నాణ్యత, నిర్ణీత పరిమాణాలు, సమయపాలనపై ప్రశ్నించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూను పక్కనపెట్టి, నాణ్యతలోనూ కోతలు పెడుతూ గుత్తేదారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు.. రోగుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యానికే తూట్లు పొడుస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తక్షణమే తనిఖీ నిర్వహించి వాస్తవాలను నిగ్గుతేల్చడంతోపాటు, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

