పాలంపేట ‘గొల్లల గుడి’కి జాతీయ గుర్తింపు!
జాతీయ ప్రాధాన్య కట్టడంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన
ఏఎస్‌ఐ అధికారిక గెజిట్‌లో నోటిఫికేషన్
రామప్పలో మరో శిల్పకళా అద్భుతానికి అరుదైన గౌరవం
కాకతీయ, ములుగు ప్రతినిధి: కాకతీయుల శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచిన ములుగు జిల్లా పాలంపేటలోని ‘గొల్లల గుడి’కి అరుదైన గుర్తింపు లభించింది. ఈ ప్రాచీన ఆలయాన్ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ (ఏఎస్‌ఐ) ఆగస్టు 31, 2026న ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గెజిట్ ఆఫ్ ఇండియా ప్రత్యేక సంచికలో ప్రచురితమైన నోటిఫికేషన్ నంబర్ ఎస్.ఒ.4802(ఇ)లో ప్రాచీన కట్టడాలు–పురావస్తు ప్రదేశాలు–అవశేషాల చట్టం–1958లోని సెక్షన్ 4(3) కింద గొల్లల గుడికి ఈ హోదా కల్పించినట్లు పేర్కొన్నారు.
కాకతీయుల శిల్పకళకు అద్దం
పాలంపేటలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో గొల్లల గుడి ఉంది. కాకతీయుల కాలం నాటి నిర్మాణ శైలి, సున్నితమైన రాతి చెక్కులు, అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. తూర్పు ముఖంగా ఉండే మండపంతో పాటు మూడు గర్భాలయాలు కలిగిన త్రికూటాలయ నిర్మాణ శైలిలో ఆలయం నిర్మితమైంది. ఆలయ ప్రహరీ, పైకప్పు అంచులు, ద్వారబంధాలపై చెక్కిన శిల్పాలు నాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. గొల్లల గుడి ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసలు, రాతిలో రూపొందించిన సున్నితమైన రంధ్రాల వల పనితనం ఆకట్టుకుంటాయి. ప్రధాన ఆలయం ముందుభాగంలో ఉన్న ఉప ఆలయాల ద్వారాల వద్ద ద్వారపాలకుల శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆలయ కుడ్యాలపై విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, గణేశుడు, మహిషాసురమర్దిని తదితర దేవతా మూర్తులతో పాటు జంతువులు, పుష్పాలంకరణలకు సంబంధించిన శిల్పాలు కనిపిస్తాయి. ఎత్తయిన వేదికపై నిర్మించిన ఈ కట్టడం కాకతీయుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తోంది.
పాలంపేటకు మరింత ప్రాధాన్యం
ఇప్పటికే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంతో అంతర్జాతీయ పర్యాటక పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన పాలంపేటకు గొల్లల గుడికి లభించిన జాతీయ హోదా మరింత ప్రాధాన్యం తీసుకురానుంది. ఒకే ప్రాంతంలో కాకతీయుల కాలానికి చెందిన విలువైన కట్టడాలు ఉండటంతో పాలంపేట చారిత్రక, సాంస్కృతిక వారసత్వ ప్రాంతంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉంది. జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించడంతో ఆలయ పరిరక్షణ, సంరక్షణ, శాస్త్రీయ నిర్వహణకు మరింత ప్రాధాన్యం లభించే అవకాశం ఉందని చరిత్ర, పురావస్తు ప్రియులు అభిప్రాయపడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా గొల్లల గుడిపై ఆసక్తి పెరిగే అవకాశం ఉంది.

