భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి
హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి
ప్రభుత్వ భూముల వివరాలు సక్రమంగా నమోదు చేయాలి
ఆర్డీఓ గణేష్, తహసీల్దార్ చందా నరేష్ ఆదేశం
కాకతీయ, నెల్లికుదురు: భూ హక్కుదారులకు ఇబ్బందులు లేకుండా రీసర్వే పనులను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని తొర్రూర్ ఆర్డీఓ గణేష్, తహసీల్దార్ చందా నరేష్ సూచించారు. రామానుజాపురం గ్రామంలో కొనసాగుతున్న రీసర్వే పనులను గురువారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నితీష్‌తో కలిసి వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ హద్దుల నిర్ధారణ, ప్రభుత్వ భూముల గుర్తింపు, రీసర్వే పురోగతిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో హద్దుల నిర్ధారణను పారదర్శకంగా చేపట్టాలని, గుర్తించిన ప్రభుత్వ భూములు, ఇతర ప్రభుత్వ ఆస్తుల వివరాలను సక్రమంగా నమోదు చేసి రికార్డులను నవీకరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు, సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

