epaper
Monday, September 14, 2026
epaper
BREAKING NEWS
Loading News...

వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌లో ట్ర‌యాంగిల్ ఫైట్‌!

వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌లో ట్ర‌యాంగిల్ ఫైట్‌!
కొండాతో ఢీకొట్టేందుకు సార‌య్య స‌న్న‌ద్ధం
సామాజిక స‌మీక‌ర‌ణంతో సీఎం అండ‌గా సుధారాణి అడుగులు
కొండా రాజ‌కీయంలో నవీన్‌రాజ్‌ చుట్టూ తిరుగుతున్న అసంతృప్తి
జీడబ్ల్యూఎంసీ టికెట్ల హామీపై క్యాడ‌ర్‌లో మిశ్ర‌మ స్పంద‌న‌
న‌వీన్ రాజ్ పేరు చెప్ప‌డంతో మ‌ళ్లీ అనేక మంది నారాజ్‌
గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉన్నవారిలో కొంత‌మంది సార‌య్య శిబిరంలోకి
సీఎం రేవంత్‌ అండ లేకుండా కొండా రాజకీయం సాగేనా..?

కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత రాజకీయాలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఒకప్పుడు కొండా దంపతుల నాయకత్వంలో ఏకతాటిపై కనిపించిన కాంగ్రెస్‌.. ప్రస్తుతం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ–మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ దంపతుల వర్గం, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్గం, కుడా చైర్మన్‌ గుండు సుధారాణి వర్గాలుగా విడిపోయిందన్న చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో కొండా దంపతులతో కలిసి పనిచేసిన కొంతమంది ముఖ్య నేతలు ఇప్పుడు సారయ్య వైపు వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో అసంతృప్తి, ఆధిపత్య పోరు, భవిష్యత్‌ టికెట్‌ ఆశలు, సామాజిక సమీకరణాలు.. అన్నీ కలసి వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌లో ట్రయాంగిల్‌ పోరుకు దారితీస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ మూడు వర్గాల్లో ఎవరు బలపడతారు..? ఎవరికి అధిష్ఠానం అండగా నిలుస్తుంది..? అన్నదే ఇప్పుడు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.

కొండావ‌ర్గం… ఇప్పుడు సారయ్య వైపు

ఎన్నికల సమయంలో కొండా దంపతుల వెంట నిలిచిన కొంతమంది ముఖ్య నేతలు ప్రస్తుతం ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శిబిరంలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. కొండా మురళీ కొంతమంది నాయకులకు మాత్రమే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ముఖ్యంగా నవీన్‌రాజ్‌కు పెద్దపీట వేస్తూ తమను పట్టించుకోవడం లేదని అసంతృప్తితో పలువురు దూరమైనట్లు సమాచారం. అదేవిధంగా కొండా సురేఖ మంత్రి పదవిలో ఉన్న సమయంలో తమకు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆశించిన స్థాయిలో సహకారం అందలేదన్న భావనతో సారయ్య వైపు వెళ్లినవారూ ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదవులు ఉన్నప్పుడు దగ్గరగా ఉన్న నేతలు.. పరిస్థితులు మారగానే ప్రత్యామ్నాయ శిబిరాలను ఆశ్రయించడం కాంగ్రెస్‌ అంతర్గత రాజకీయాల్లో కొత్త పరిణామం కాకపోయినా, వరంగల్‌ తూర్పులో ఇది భవిష్యత్‌ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది.
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో సార‌య్య‌ మళ్లీ బరిలో ఉంటానని ఆయ‌న వ‌ర్గం నుంచి బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో తనకు ఉన్న సీనియారిటీ, గత రాజకీయ అనుభవం, నియోజకవర్గంలోని పాత పరిచయాలు, ప్రస్తుతం తన వైపు వస్తున్న నేతలను బలంగా చూపిస్తూ సారయ్య టికెట్‌ రేసులో ముందుకు సాగుతున్నట్లు ఆయన వర్గీయులు చెబుతున్నారు. కొండా దంపతులపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలను తనవైపు తిప్పుకోవడం ద్వారా నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని సారయ్య భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే సారయ్యకు పార్టీ అధిష్ఠానం నుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తుంది..? ఆయనకు టికెట్‌ హామీ ఉందా..? అన్నది ఇప్పటికీ స్పష్టత లేని అంశంగానే ఉంది.

సుధారాణికి క‌లిసొస్తున్న సామాజిక స‌మీక‌ర‌ణం..!

వరంగల్‌ తూర్పు రాజకీయాల్లో కుడా చైర్ ప‌ర్స‌న్‌ గుండు సుధారాణి పేరు కూడా కీలకంగా మారింది. కొండా సురేఖ మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురయ్యే పరిణామాలకు ముందు రోజు.. తాను బీసీ పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారినని, ఆ సామాజిక వర్గం ఓట్లు రాష్ట్రంలో గణనీయంగా ఉన్నాయని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అదే సామాజిక వర్గానికి చెందిన గుండు సుధారాణికి పార్టీలో, ప్రభుత్వ పదవిలో ప్రాధాన్యం కల్పిస్తూ కుడా చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఈ నిర్ణయంపై పార్టీలో అంతర్గతంగా కొంత వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన రాజకీయ లక్ష్యంతోనే ఆమెకు ప్రాధాన్యం కల్పించారన్న అభిప్రాయాన్ని పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే గుండు సుధారాణిని వరంగల్‌ తూర్పు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దింపే అవకాశం ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే కొండా దంపతులు, సారయ్యతో పాటు సుధారాణి వర్గం కూడా ప్రత్యక్ష టికెట్‌ పోటీలోకి వచ్చినట్లవుతుంది.

సీఎం రేవంత్‌ అండ లేకుండా కొండా రాజకీయం సాగేనా..?

కొండా సురేఖ మంత్రివర్గం నుంచి తొలగింపునకు గురైన నేపథ్యంలో వరంగల్‌ తూర్పులో ఆమె రాజకీయ భవిష్యత్‌పై చర్చ మొదలైంది. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత పటేల్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించడం.. కొండా కుటుంబ రాజకీయాలపై ప్రభావం చూపిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కొండా దంపతులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేయడం కొంతమేరకు రాజకీయ స్పష్టత ఇచ్చింది. అధిష్ఠానం నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌, జరిగిన రాయబారం తమకు భరోసా కల్పించిందని వారు భావిస్తున్నప్పటికీ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష మద్దతు లేకుండా వరంగల్‌ తూర్పులో తమ రాజకీయాన్ని సజావుగా నడిపించగలరా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పీసీసీ, జిల్లా కాంగ్రెస్‌ కమిటీలు భవిష్యత్‌లో టికెట్లు ఖరారు చేసే సమయంలో ముఖ్యమంత్రి అభిప్రాయం ఎంతమేరకు ప్రభావం చూపుతుంది..? కొండా దంపతులకు అధిష్ఠానం నుంచి పూర్తి మద్దతు ఉందా..? లేక పరిస్థితులను బట్టి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించే ఆలోచనలో పార్టీ ఉందా..? అన్నది కీలకంగా మారింది.

నవీన్‌రాజ్‌ చుట్టూ తిరుగుతున్న అసంతృప్తి

కొండా వర్గీయుల్లో పలువురు దూరమవడానికి నవీన్‌రాజ్‌ వ్యవహారశైలే కారణమన్న అభిప్రాయం బలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొండా మురళీ తన ప్రసంగాల్లోనూ నవీన్‌రాజ్‌ పేరును పదేపదే ప్రస్తావించడం.. ఇప్పటికే అసంతృప్తితో ఉన్న క్యాడర్‌లో మరింత అసహనానికి దారితీస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాయకత్వం చుట్టూ ఒక్కరికి మాత్రమే అధిక ప్రాధాన్యం లభిస్తోందన్న భావన ఏర్పడితే.. మిగిలిన నేతలు ప్రత్యామ్నాయ శిబిరాల వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వరంగల్‌ తూర్పులో జరుగుతున్న పరిణామాలు అదే దిశగా సాగుతున్నాయన్న చర్చ ఉంది. పార్టీని విస్తరించాల్సిన సమయంలో నాయకుల మధ్య వ్యక్తిగత ఆధిపత్య పోరు పెరగడం కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

జీడబ్ల్యూఎంసీ టికెట్ల హామీ.. కొత్త చిచ్చు

ఇప్పటికే వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌ అనేక వర్గాలుగా విడిపోయిందన్న చర్చ జరుగుతున్న సమయంలో.. కొండా మురళీ–సురేఖ దంపతులు తమను నమ్ముకున్న వారందరికీ వచ్చే జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో టికెట్లు అందజేస్తామని చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీలో టికెట్ల కోసం ఇప్పటికే పలువురు నేతలు పోటీ పడుతున్న వేళ.. ఒక వర్గానికి చెందిన నాయకత్వం ముందుగానే టికెట్ల హామీలు ఇవ్వడం ఇతర వర్గాల్లో అసంతృప్తికి దారితీసే అవకాశముంది. ముఖ్యంగా వివాదాస్పదుడిగా పేరు పొందిన నవీన్‌రాజ్‌ చేతుల మీదుగా బాధ్యతలు అప్పగిస్తామని చెప్పడం కూడా క్యాడర్‌లో చర్చకు కారణమవుతోంది. పార్టీలో అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన సమయంలో.. ఒక వ్యక్తి చుట్టూ నిర్ణయాధికారం కేంద్రీకృతం కావడం సమంజసమేనా..? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టికెట్ల పంపిణీ విషయంలో పారదర్శకత లేకపోతే ఇప్పటికే ఉన్న వర్గ విభేదాలు మరింత ముదిరే ప్రమాదం ఉంది.

కొండాకు క్యాడర్‌ మద్దతు లభిస్తుందా..?

కొండా దంపతులు కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేసినప్పటికీ.. వారి వెంట నడిచే క్యాడర్‌ మొత్తం అదే స్థాయిలో నిలుస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. నాయకత్వంపై వ్యక్తిగత నమ్మకం, స్థానికంగా లభించే ప్రాధాన్యం, భవిష్యత్‌ రాజకీయ అవకాశాలు.. ఇవన్నీ కార్యకర్తల నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాలుగా మారుతున్నాయి. పార్టీలో మూడు ప్రధాన వర్గాలు ఏర్పడినట్లు చర్చ జరుగుతున్న సమయంలో.. కొండా దంపతులు తమ వర్గాన్ని ఏకతాటిపైకి తీసుకురాగలరా..? దూరమైన నేతలను తిరిగి కలుపుకోగలరా..? నవీన్‌రాజ్‌ చుట్టూ నెలకొన్న అసంతృప్తిని చల్లార్చగలరా..? అన్నదే వారి ముందున్న ప్రధాన సవాలు.
వరంగల్‌ తూర్పులో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రస్తుతం మూడు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కొండా దంపతుల రాజకీయ వారసత్వం, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అనుభవం, గుండు సుధారాణికి లభిస్తున్న ప్రభుత్వ–పార్టీ ప్రాధాన్యం.. ఈ మూడు అంశాలు భవిష్యత్‌ పోరును నిర్ణయించే అవకాశముంది. అయితే టికెట్‌ ఖరారు విషయంలో స్థానిక వర్గాల బలం మాత్రమే కాకుండా.. సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం, పీసీసీ నిర్ణయం, పార్టీ అధిష్ఠానం వ్యూహం, సామాజిక సమీకరణాలు కీలకంగా మారనున్నాయి. ఒకవైపు కొండా దంపతులు తమ రాజకీయ పట్టు కొనసాగించేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు సారయ్య తనకు మళ్లీ అవకాశం రావాలని స్పష్టం చేస్తున్నారు. గుండు సుధారాణి పేరు కూడా ప్రత్యామ్నాయంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్‌ తూర్పు కాంగ్రెస్‌లో ప్రస్తుత పోరు కేవలం వ్యక్తుల మధ్య పోటీగా కాకుండా.. ఆధిపత్యం, సామాజిక సమీకరణాలు, అధిష్ఠానం అండ, టికెట్‌ వ్యూహాల మధ్య జరుగుతున్న త్రిముఖ రాజకీయ పోరుగా మారుతోంది. వచ్చే ఎన్నికల నాటికి ఈ మూడు వర్గాల్లో ఎవరు బలపడతారు..? ఎవరు బలహీనపడతారు..? చివరికి కాంగ్రెస్‌ టికెట్‌ ఎవరికి దక్కుతుంది..? అన్నదే మ‌రి కొద్దిరోజుల్లోని ప‌రిణామాల‌తో తేలిపోనుంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం

మోదీ మోడల్ రాజకీయ శాస్త్రం ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన మైలురాయిని చేరుకున్నారు....

ముగింపు అంచున‌ మావోయిస్టులు

ముగింపు అంచున‌ మావోయిస్టులు ‘కగార్’తో కట్టుదిట్టమైన దెబ్బ‌కొట్టిన కేంద్రం మావోయిస్టుల‌ దుర్భేద్య‌మైన కోట‌లకు బీట‌లు అబుజ్‌మడ్...

ధ‌న్‌ఖ‌డ్ రాజీనామాకు కార‌ణం ఎవ‌రు..?

ధ‌న్‌ఖ‌డ్ రాజీనామాకు కార‌ణం ఎవ‌రు..? ఉపరాష్ట్ర ప‌తి ప‌ద‌వికి ధ‌న్‌ఖ‌డ్ రాజీనామా చేయ‌డం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.