సేవే శ్వాసగా.. పువ్వాడ కుటుంబం
ఏళ్లుగా పేదల కోసం ఉచిత సేవా కార్యక్రమాలు
పువ్వాడ నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా మరో సేవా సంకల్పం
88 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాల పంపిణీకి ఏర్పాట్లు
కాకతీయ, ఖమ్మం : పేదల కష్టాన్ని తన కష్టంగా భావించడం.. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం.. సేవను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా జీవిత విధానంగా కొనసాగించడం.. ఇదే పువ్వాడ కుటుంబం ప్రత్యేకత. రాజకీయాల్లో ఉన్నా.. ప్రజా జీవితంలో ఉన్నా.. మానవత్వమే మార్గంగా ముందుకు సాగుతున్న పువ్వాడ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కుటుంబం సేవా కార్యక్రమాలకు చిరునామాగా నిలుస్తోంది. ఏళ్ల తరబడి ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని పేదలకు ఉచిత వైద్యం, శస్త్రచికిత్సలు, మందుల పంపిణీతో పాటు గర్భిణులకు సహాయం, కరోనా సమయంలో ఆపన్నహస్తం అందించడం వంటి అనేక సేవలను పువ్వాడ కుటుంబం కొనసాగిస్తోంది. మమత ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఎన్నో కుటుంబాలకు భరోసాగా నిలిచాయి.
జన్మదిన వేడుకల్లో సేవా పరిమళం
పువ్వాడ నాగేశ్వరరావు 88వ జన్మదినం సందర్భంగా మరో విశిష్ట సేవా కార్యక్రమానికి కుటుంబ సభ్యులు శ్రీకారం చుడుతున్నారు. ఈ నెల 13న సాయంత్రం 4 గంటలకు ఖమ్మంలోని రోటరీ క్లబ్లో 88 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలను పంపిణీ చేయనున్నారు. పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా కాకుండా.. అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడేలా నిర్వహించడం పువ్వాడ కుటుంబం సేవా దృక్పథానికి నిదర్శనం. పువ్వాడ నాగేశ్వరరావు 75వ జన్మదినం నుంచి ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గత 15 ఏళ్లలో దాదాపు 1,000 మందికి వివిధ రూపాల్లో సహాయం అందించారు. వైద్య సేవలు, ఆపరేషన్లు, మందులు, పేద కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు, దివ్యాంగులకు అవసరమైన సహాయ పరికరాల పంపిణీ వంటి కార్యక్రమాలు నిరంతరంగా సాగుతున్నాయి.
పువ్వాడ నాగేశ్వరరావు చూపిన సేవా మార్గాన్ని పువ్వాడ అజయ్‌కుమార్ మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల మధ్య ఉంటూ.. వారి సమస్యలను తెలుసుకుంటూ.. సాధ్యమైనంత వరకు పరిష్కారం చూపాలనే తపనతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొననున్నారు. సేవకు కుటుంబమంతా ఒక్కటై నిలవడం ఖమ్మం ప్రజల ప్రశంసలు అందుకుంటోంది.

