ప్లాన్ ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలి
నిబంధనలు ఉల్లంఘిస్తే ఇబ్బందులు తప్పవు
జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న
కాకతీయ, వరంగల్ ప్రతినిధి: అనుమతి పొందిన ప్లాన్ ప్రకారమే భవన నిర్మాణాలు చేపట్టాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న స్పష్టం చేశారు. బుధవారం హన్మకొండలోని గోపాల్పూర్, కాజీపేట, ప్రకాశ్‌రెడ్డిపేట, పద్మాక్షి కాలనీ తదితర ప్రాంతాల్లో నిర్మించిన భవనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీకి సంబంధించి నిర్మాణాల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా అదనపు నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ప్లాన్‌కు, వాస్తవ నిర్మాణానికి వ్యత్యాసం లేకుండా చూసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవన్నారు. పరిశీలనలో సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, టీపీఓ అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

