నిరుపేదలకు అండగా సీఎంఆర్ఎఫ్
అనారోగ్య బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చొరవతో సాయం మంజూరు
విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు కొండపర్తి బాలబ్రహ్మచారి
కాకతీయ, హన్మకొండ : నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని విశ్వకర్మ సంఘం రాష్ట్ర నాయకులు కొండపర్తి బాలబ్రహ్మచారి అన్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాసోజు లక్ష్మీనారాయణ చారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కును బుధవారం ఆయన బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా బాలబ్రహ్మచారి మాట్లాడుతూ రాసోజు లక్ష్మీనారాయణ చారి అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలనే ఉద్దేశంతో సమస్యను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. మంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారని వివరించారు. సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం ఆర్థిక సాయం మంజూరు చేసిందన్నారు. మంజూరైన చెక్కును బాధిత కుటుంబానికి అందజేసినట్లు తెలిపారు. సాయం అందేలా చొరవ చూపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి బాలబ్రహ్మచారి, బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

