నాగేంద్రుడికి భాద్రపద మాస ప్రత్యేక పూజలు
27 నుంచి స్వామివారి మండల దీక్షలు ప్రారంభం
ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు
కాకతీయ, గీసుగొండ : భాద్రపద మాసం రెండో మంగళవారాన్ని పురస్కరించుకుని నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని ఊకల్ హవేలి గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో భాద్రపద మాసం రెండో మంగళవారం సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనా చార్యులు వైదిక మంత్రో చ్ఛరణల నడుమ స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనా చార్యులు మాట్లాడుతూ భాద్రపద మాసంలో స్వామివారిని దర్శించుకుని వెండి కన్ను, పైడి కన్ను సమర్పించి పూజలు నిర్వహిస్తే కాలసర్ప దోషాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఈ నెల 27వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వామివారి మండల దీక్ష మాల ధారణ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మాల ధరించే భక్తులు మాలధారణకు ఒకరోజు ముందు ఉపవాసం ఉండి, మరుసటి రోజు నియమనిష్టలతో మాలధారణ స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తిమ్మాపురం రాజేశ్వర రావు,కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, కమిటీ సభ్యులు గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

