చారిత్రక సంపదకు భరోసా!
రామప్ప పరిరక్షణపై ఎన్జీటీ సుమోటో
ఓపెన్‌కాస్ట్ తవ్వకాలతో ఆలయం, చెరువుకు ముప్పు
రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్ ఆకిరెడ్డి వెంకట రామమోహన్‌రావు
కాకతీయ, హన్మకొండ : ప్రపంచ వారసత్వ ప్రదేశమైన రుద్రేశ్వర (రామప్ప) ఆలయం, రామప్ప చెరువు సమీపంలో ప్రతిపాదిత ఓపెన్‌కాస్ట్ బొగ్గు గనుల తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సుమోటోగా విచారణకు స్వీకరించడాన్ని రామప్ప పరిరక్షణ కమిటీ స్వాగతించింది. ఈ సందర్భంగా కమిటీ కన్వీనర్ ఆకిరెడ్డి వెంకట రామమోహన్‌రావు ఎన్జీటీకి, ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 800 ఏళ్ల కాకతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన రామప్ప ఆలయం ఇసుక పునాది సాంకేతికతతో నిర్మితమైందని, బొగ్గు గనుల తవ్వకాల్లో జరిగే భారీ పేలుళ్ల ప్రకంపనలతో కట్టడం దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. మూడు టీఎంసీల సామర్థ్యం కలిగిన చారిత్రక రామప్ప చెరువుకూ ముప్పు పొంచి ఉందన్నారు. ఎన్జీటీ జోక్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా యంత్రాంగం స్పందించి రామప్ప పరిసర ప్రాంతాన్ని పర్యావరణ రక్షిత బఫర్ జోన్‌గా ప్రకటించాలని రామమోహన్‌రావు డిమాండ్ చేశారు. రామప్ప ఆలయం కేవలం చారిత్రక కట్టడం మాత్రమే కాదని, జాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంటూ భవిష్యత్ తరాల కోసం దాని పరిరక్షణకు ప్రజలు, పర్యావరణ ప్రేమికులు, మేధావులు ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.

