రోడ్డు ఆక్రమిస్తే డ్రైనేజీ ఎక్కడ?
ప్రణాళిక లేని కట్టడాలతో మునకలో వరంగల్
రెండో రాజధాని సౌందర్యానికి అక్రమ నిర్మాణాల గ్రహణం
నిబంధనలు పాటించేవాడే బలి?
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం, రెండో రాజధానిగా గుర్తింపు పొందిన వరంగల్ లో అక్రమ నిర్మాణాలు నగర సౌందర్యాన్ని మసకబారుస్తున్నాయి. ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ఇవి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. నగరాభివృద్ధి నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలకు తప్పనిసరిగా సెట్ బ్యాక్ ఉండాలి. దీనివల్ల డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి పైపులైన్లు, విద్యుత్ సౌకర్యాలు, రోడ్డు విస్తరణ వంటి ప్రజా మౌలిక వసతులు కల్పించడం సులభమవుతుంది. కానీ నాని గార్డెన్స్ సమీపంలోని నిర్మాణంలో ఈ నిబంధనలను పూర్తిగా విస్మరించారు.

వర్షాకాలంలో నరకయాతన..
“ఇప్పటికే వర్షాకాలంలో నీరు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు మొత్తం భవనాలతో ఆక్రమిస్తే మురుగునీటి పారుదల పూర్తిగా దెబ్బతింటుంది. డ్రైనేజీ కాలువలు ఎక్కడ నిర్మిస్తారు?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు విస్తరణ అవసరం వచ్చినా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించే సామాన్యుడు అనుమతుల కోసం కార్పొరేషన్ చుట్టూ నెలల తరబడి తిరుగుతుంటే, నిబంధనలు ఉల్లంఘించే వారికి మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకపోవడం గమనార్హం. నిబంధనలు పాటించే వారికంటే ఉల్లంఘించే వారికే ప్రాధాన్యం లభిస్తోందనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోతోంది.
ప్రజల డిమాండ్ ఏంటి?
ఉరుసు గుట్ట సమీపంలోని శ్రీలక్ష్మీ కార్ జోన్ పక్కనే జరుగుతున్న బారి నిర్మాణాన్ని వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి, రోడ్డు ఆక్రమణ జరిగి ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ను కోరుతున్నారు. నగరంలో జరుగుతున్న అన్ని అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా రహదారులను పరిరక్షించడం, భవిష్యత్ తరాలకు ప్రణాళికాబద్ధమైన నగరాన్ని అందించడం అధికారుల బాధ్యత అని వారు గుర్తు చేస్తున్నారు.

