గంగమ్మ ఒడికి బొజ్జగణపయ్యలు
హైదరాబాద్‌లో సామూహిక వినాయక నిమజ్జనాలు పూర్తి
పోలీసు సిబ్బందితో కలిసి సంబరాల్లో పాల్గొన్న సీపీ
కాకతీయ, హైదరాబాద్ : ఇన్నిరోజులు భక్తుల పూజలందుకున్న వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయని హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నగరంలో సామూహిక వినాయక నిమజ్జనాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. ఖైరతాబాద్, బాలాపూర్ గణేశుల నిమజ్జనాన్ని కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేయించామని వెల్లడించారు. నిమజ్జన కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగాయని సజ్జనార్ తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారని చెప్పారు. నిమజ్జనానికి ముందు సమీక్ష సమావేశం నిర్వహించడంతోపాటు క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించామని తెలిపారు. నిమజ్జన కార్యక్రమానికి సహకరించిన అన్ని శాఖల అధికారులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈసారి భారీ సంఖ్యలో గణేశ్ విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చాయని సజ్జనార్ తెలిపారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనాన్ని తిలకించేందుకు సుమారు 30 లక్షల మంది, బాలాపూర్ గణేశ్ నిమజ్జనానికి సుమారు 15 లక్షల మంది హాజరైనట్లు చెప్పారు. నిమజ్జనంలో పేపర్ షాట్ మిషన్లను ఈసారి ఎక్కువగా వినియోగించినట్లు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఎత్తివేత
నిమజ్జనాలు పూర్తికావడంతో సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేశారు. ట్యాంక్‌బండ్, లిబర్టీ, అసెంబ్లీ వైపు రాకపోకలను పునరుద్ధరించారు. నిమజ్జనాలు ప్రశాంతంగా ముగియడంతో తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద పోలీసు సిబ్బంది సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ పోలీసు సిబ్బందితో కలిసి డ్యాన్స్ చేశారు. నిమజ్జనాల సందర్భంగా ట్యాంక్‌బండ్ చుట్టూ పలు రహదారులను పోలీసులు మూసివేశారు. ఖైరతాబాద్, లక్డీకాపూల్, లిబర్టీ, నారాయణగూడ, హిమాయత్‌నగర్, హైదర్‌గూడ, బషీర్‌బాగ్, లోయర్ ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ నెలకొంది. నిమజ్జనాలు పూర్తికావడంతో రాకపోకలను క్రమంగా పునరుద్ధరించారు.

