జర్నలిస్టులకు హెల్త్ కార్డులు ఇవ్వాలి
గాంధీ విగ్రహం ఎదుట టీయూడబ్ల్యూజే నిరసన
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్ డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ పిలుపు మేరకు శుక్రవారం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ముఖ్యమంత్రికి లేఖలు రాసి నిరసన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడిచినా జర్నలిస్టుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని బీఆర్ లెనిన్ అన్నారు. ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అక్రిడిటేషన్ల జారీ వంటి అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. వరంగల్‌లో జర్నలిస్టుల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటికీ పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయడంతోపాటు జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు చిలుముల సుధాకర్, తడక రాజనారాయణ, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, తుమ్మ శ్రీధర్‌రెడ్డి, కక్కెర్ల అనిల్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి వాంకే శ్రీనివాస్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు నవనీత్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి నీలం శివ తదితరులు పాల్గొన్నారు.

