రైస్ మిల్లు నిర్మాణం వద్దంటూ గ్రామస్తుల ధర్నా
కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామం సమీపంలో రైస్ మిల్లు నిర్మాణం చేయవద్దంటూ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామసభలో వినతిపత్రం అందజేసిన అనంతరం రైస్ మిల్లు ముందు, చిన్ననాగారం–ఎర్రబెల్లిగూడెం రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామానికి ఆనుకొని రైస్ మిల్లు నిర్మిస్తే కాలుష్యం, శబ్ద సమస్యలు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఇళ్లకు సమీపంలో, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కనీస దూరం పాటించకుండా నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. మిల్లు నిర్మాణంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే కార్మికుల వల్ల గ్రామంలో సమస్యలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని రైస్ మిల్లుకు అనుమతులు ఇవ్వవద్దని ఉన్నతాధికారులను కోరారు. కార్యక్రమంలో గుడాల లక్ష్మారెడ్డి, బైరు రమేష్, ఉడుత సోమయ్య, బొబ్బల దేవరాజు, గుగులోతు లక్ష్మి, మాదగాని ఉమేష్, వడపల్లి వెంకన్న, ఆలకుంట్ల సోమయ్య, బత్తిని ఐలయ్య, మునిగంటి రమేష్, గుండాల దర్గా స్వామి, నిడిగంటి బిక్షం, గుగులోతు జానీ, మద్దబోయిన సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.

