బైపాస్ మార్గంపై ప్రభుత్వం ఆలోచించాలి
ఇళ్లు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలి
సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్
కాకతీయ, చిగురుమామిడి : కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు నాలుగు వరుసల రహదారి విస్తరణలో ఇళ్లు, భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం పునరావాసం కల్పించి నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. చిగురుమామిడిలో రోడ్డు వెడల్పులో ఇళ్లు కోల్పోతున్న బాధితులు రెండు రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. బాధితులు తమ సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు. నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఇళ్లు కోల్పోతున్న వారికి న్యాయం చేయకుండా, నష్టపరిహారం ఇవ్వకుండా నివాసాలను కూల్చడం సరికాదని చాడ వెంకటరెడ్డి అన్నారు. 70 ఏళ్లుగా ఉన్న ఇళ్లతోపాటు ఇటీవల లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించుకున్న ఇళ్లను కోల్పోతే కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. బైపాస్ మార్గం ద్వారా రహదారి నిర్మించే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇచ్చిన విధంగానే ఇళ్లు కోల్పోతున్న వారికి ఇంటి స్థలంతోపాటు నిర్మాణ వ్యయాన్ని లెక్కించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. బాధితుల సమస్యను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోసం కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు అందె చిన్నస్వామి, తేరాల సత్యనారాయణ, మాజీ సర్పంచ్ గోలీ బాపురెడ్డి, సీపీఐ నాయకుడు కయ్యం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

