15 భద్రతా ఫీచర్లతో కొత్త మీ సేవ సర్టిఫికెట్లు
లామినేషన్ అవసరం లేకుండా ప్రత్యేక తయారీ
నకిలీ ధ్రువపత్రాలకు చెక్ పెట్టేలా రూపకల్పన
ఏళ్ల తరబడి భద్రంగా దాచుకునే వెసులుబాటు
2011 నుంచి కొనసాగుతున్న సెక్యూరిటీ పేపర్ విధానంలో మార్పు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కాకతీయ, హైదరాబాద్ : ప్రభుత్వ ధ్రువపత్రాలు చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ఉండేలా ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త మీ సేవ సర్టిఫికెట్ పేపర్‌ను అందుబాటులోకి తెచ్చామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లతో రూపొందించిన ఈ పేపర్‌తో సర్టిఫికెట్ల మన్నిక పెరగడంతో పాటు నకిలీల తయారీని అరికట్టేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో కొత్త సెక్యూరిటీ పేపర్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, విజయ రమణారావు, ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి. రవికిరణ్, అధికారులు, ప్రింటింగ్ ఏజెన్సీలు, సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. కొత్త పేపర్లో 15 అత్యాధునిక భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ, అనధికార నకళ్లను అరికట్టేలా వీటిని రూపొందించారు. భద్రతా కారణాలతో ఈ ఫీచర్ల పూర్తి వివరాలను వెల్లడించడం లేదు. ప్రత్యేక తయారీ విధానం వల్ల పేపర్ సులభంగా చినిగిపోకుండా, నీళ్లు పడినా త్వరగా దెబ్బతినకుండా ఉంటుంది.
లామినేషన్ అవసరం తగ్గింపు
సాధారణ వినియోగం, మడతలు పడటం, దీర్ఘకాలం భద్రపరచడం వల్ల సర్టిఫికెట్లు దెబ్బతినే అవకాశాన్ని కొత్త పేపర్ తగ్గిస్తుంది. దీంతో జనన, మరణ ధ్రువపత్రాలు, విద్యా, ఉద్యోగ, ఇతర అధికారిక అవసరాలకు సంబంధించిన పత్రాలను ఏళ్ల తరబడి మంచి స్థితిలో భద్రపరచుకోవచ్చు. సాధారణ పరిస్థితుల్లో వీటికి లామినేషన్ చేయించాల్సిన అవసరం కూడా తగ్గుతుంది. జనన, మరణ ధ్రువపత్రాలతో పాటు విద్య, ఉద్యోగ అవసరాలకు ఉపయోగించే అధికారిక పత్రాలను జీవితాంతం భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. అలాంటి పత్రాలు త్వరగా పాడవకుండా చూడటంతో పాటు వాటి విశ్వసనీయతను కాపాడటం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవల్లో నాణ్యత, భద్రత, సౌలభ్యాన్ని పెంచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, కొత్త సెక్యూరిటీ పేపర్‌తో ప్రజలకు అందించే సేవలపై విశ్వాసం మరింత పెరుగుతుందని వివరించారు.తెలంగాణలో 2011 నుంచి మీ సేవ కేంద్రాల ద్వారా జారీ చేసే సర్టిఫికెట్ల ముద్రణకు ప్రత్యేక సెక్యూరిటీ పేపర్‌ను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పేపర్ స్థానంలో మరింత నాణ్యత, భద్రత, మన్నిక కలిగిన కొత్త పేపర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా దీర్ఘకాలం భద్రపరచాల్సిన ప్రభుత్వ ధ్రువపత్రాలకు ఈ విధానం ఉపయోగపడనుంది.

