మూడు దశల్లో సమగ్ర భూసర్వే
285 గ్రామాల్లో సర్వే పూర్తి..
అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు
వచ్చే నెలాఖరుకు తొలి దశ పూర్తి చేయాలని లక్ష్యం
9,767 ఎకరాల భూమి ఆదా.. రూ.2,148.74 కోట్ల వ్యయం తగ్గింపు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి
కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో చేపట్టిన సమగ్ర భూసర్వేను మూడు దశల్లో పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తిచేసి, భూ యజమానుల అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. వచ్చే నెలాఖరుకు తొలి దశను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శనివారం సచివాలయంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో తొలి దశలో 2,720 గ్రామాలను ఎంపిక చేసినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 411 రోవర్లను కొనుగోలు చేయగా, అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారయ్యాయని చెప్పారు. డీజీపీఎస్, జీఐఎస్, క్యూజీఐఎస్ సాంకేతికతతో భూముల కొలతలను కచ్చితంగా నిర్వహించి, వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరుస్తామన్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి సర్వే నంబర్కు ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించి, భూదార్ కార్డులు జారీ చేస్తామని తెలిపారు. డిజిటల్ సర్వే సమాచారాన్ని భూ భారతి పోర్టల్లో నమోదు చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షలుగా ఉన్న సర్వే నంబర్లు ప్రస్తుతం 2.29 కోట్లకు పెరిగాయని వివరించారు.
పైపుల కాలువలతో వేల ఎకరాల భూమి ఆదా
సీతారామ ఎత్తిపోతల పథకం పంపిణీ కాలువలను సాంకేతికంగా సాధ్యమైన ప్రాంతాల్లో పైపుల వ్యవస్థగా మార్చాలని మంత్రి ప్రతిపాదించారు. ప్రస్తుతం సుమారు 11,162 ఎకరాల భూమి అవసరం కాగా, పైపుల విధానంతో ఆ అవసరాన్ని 1,395 ఎకరాలకు తగ్గించవచ్చని అంచనా వేశారు. దీంతో 9,767 ఎకరాల భూమి ఆదా కావడంతో పాటు భూసేకరణ వ్యయంలో రూ.2,148.74 కోట్ల వరకు తగ్గింపు సాధ్యమవుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా మొత్తం 6,74,387 ఎకరాలకు సాగునీటి ప్రయోజనం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
పాలేరులో త్వరలో భూదార్ పట్టాల పంపిణీ
తన పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పరిధిలో 665 ఎకరాలకు వంద శాతం రీసర్వే పూర్తిచేసినట్లు మంత్రి తెలిపారు. త్వరలో అక్కడ భూదార్ పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. సర్వేకు ముందు పట్టాదారులకు నోటీసులు ఇవ్వాలని, ఒకటి రెండు రోజుల ముందుగా గ్రామాల్లో చాటింపు వేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, గ్రామకంఠం హద్దులను స్పష్టంగా గుర్తించిన తర్వాతే సర్వే చేపట్టాలని సూచించారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

