వరంగల్ డీసీసీబీకి రూ.10.23 కోట్ల లాభం
సహకార సంఘాలకు కొత్త పంట రుణాల కింద రూ.10 లక్షలు
సభ్య సంఘాలకు రూ.1.53 కోట్ల డివిడెండ్ ప్రకటన
రైతులకు మెరుగైన సేవలే లక్ష్యం: కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి
కాకతీయ, వరంగల్ బ్యూరో: వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.10.23 కోట్ల నికర లాభాన్ని సాధించిందని హనుమకొండ జిల్లా కలెక్టర్, డీసీసీబీ పర్సన్ ఇన్‌ఛార్జి కమిటీ అధ్యక్షురాలు చాహత్ బాజ్‌పాయి తెలిపారు. ప్రతి సహకార సంఘానికి కొత్త పంట రుణాల కింద రూ.10 లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం హనుమకొండలో నిర్వహించిన డీసీసీబీ మహాజనసభలో బ్యాంకు ఆర్థిక పరిస్థితి, రుణాల మంజూరు, వసూళ్లు, సహకార సంఘాల బలోపేతంపై చర్చించారు. బ్యాంకు నికర లాభాల నుంచి సభ్య ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు రూ.1.53 కోట్ల డివిడెండ్ ప్రకటించారు. వార్షిక ఆర్థిక నివేదికలు, బ్యాలెన్స్ షీట్, లాభనష్టాల ఖాతా, ఆడిట్ ధ్రువీకరణ, ఆడిటర్ల నియామకం, లాభాల వినియోగం వంటి అంశాలను పరిశీలించారు. 50 శాతానికి పైగా రుణ వసూళ్లు సాధించిన అర్హతగల సంఘాలకు రూ.50 లక్షల వరకు, మిగిలిన ఏ, బీ కేటగిరీ ఆడిట్ ర్యాంకింగ్ సంఘాలకు రూ.30 లక్షల వరకు దీర్ఘకాలిక రుణాలు అందించే సదుపాయం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రుణ బకాయిదారులకు ఉపశమనం కల్పించే వన్‌టైమ్ సెటిల్మెంట్ పథకాన్ని 2027 మార్చి 31 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి, ములుగు, ఘనపూర్ శాఖల భవన నిర్మాణాలకు స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందన్నారు. సహకార సంఘాల ఆర్థిక బలోపేతం, రుణ వసూళ్ల మెరుగుదల, రైతులకు మెరుగైన సేవలపై సమావేశంలో చర్చించారు. బ్యాంకు అనుబంధ గుర్తింపు అంశంపై సొసైటీల ప్రతినిధులు లేవనెత్తిన ప్రశ్నలకు అదనపు కలెక్టర్ ఎన్. రవి, పర్సన్ ఇన్‌ఛార్జి కమిటీ సభ్యులు స్పందించి, సంబంధిత అంశాలను పరిశీలిస్తామని తెలిపారు.

