పేదల గుడిసెలు కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమా?
వైఎస్సార్ నగర్ వాసులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి
పేదల భూముల కబ్జా యత్నాలపై చర్యలు తీసుకోవాలి
ప్రజాసంఘాల జేఏసీ నేతలుమాదాసి సురేష్, కేడల ప్రసాద్, పద్మజాదేవి
కాకతీయ, కాజీపేట : పేదల గుడిసెలు కూల్చివేయడమే ఇందిరమ్మ రాజ్యమా? సంపన్న కాలనీలో పేదలకు నివసించే హక్కు లేదా? అని ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్, మహాత్మ జ్యోతిరావు పూలే సామాజిక న్యాయవేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేడల ప్రసాద్ పటేల్, జనసేన పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పద్మజాదేవి ప్రశ్నించారు. ఆదివారం కాజీపేటలోని వైఎస్సార్ నగర్ గుడిసెలను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. వైఎస్సార్ నగర్లోని సర్వే నంబర్లు 70, 71, 72, 73లో సుమారు 150 పేద కుటుంబాలు గత మూడు దశాబ్దాలుగా గుడిసెలు వేసుకుని నివసిస్తున్నాయని నేతలు తెలిపారు. ఆయా కుటుంబాలకు ఇంటి నంబర్లతో పాటు ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఈ భూములపై కన్నేసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న పేదలకు రాజ్యాంగం కల్పించిన నివాస హక్కును ప్రభుత్వం హరిస్తోందని విమర్శించారు.
పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలి
150 కుటుంబాలను అక్కడి నుంచి తొలగించకుండా అదే స్థలంలో పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నేతలు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పేదలకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన నిలబడి పోరాడుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు శనిగరపు లక్ష్మి, నీరటి పావని, జానపట్ల మంజుల, జానపట్ల శిరీష, ఎండీ అఫ్జల్, ఎండీ నికత్, ఎండీ నజీమా, సంబారి రుక్కమ్మ, గుండ్రాతి భాగ్యలక్ష్మి, ఎండీ రఫీయా, రాపర్తి ధనలక్ష్మి, చిలగాని ధనలక్ష్మి, ఓర్సు శంకరమ్మ, పూల లావణ్య, నీరటి పుష్ప, రాజగోపాల రేణుక, శనిగరపు సతీష్, ఓర్సు కొమురయ్య, నీరటి ఏలియా, ఎండీ రజాక్ తదితరులు పాల్గొన్నారు.

