నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి ఇవ్వాలి!
ఎన్నికల హామీని అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం
గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు గడువు పొడిగించాలి
బీఆర్ఎస్ పట్టణ ఎమ్మెల్సీ ఇన్చార్జీలు గోనె యువరాజు, రాయిడి దుష్యంత్‌రెడ్డి
కాకతీయ, నర్సంపేట టౌన్: నిరుద్యోగ యువతకు ఎన్నికల హామీ మేరకు నెలకు రూ.4 వేల భృతి వెంటనే అందించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో పట్టణంలోని 29, 5, 8వ వార్డుల్లో ఇంటింటికీ తిరిగి గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా యువరాజు, దుష్యంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేస్తోందని విమర్శించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. సర్వర్ సమస్యలతో పలువురు పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోలేకపోతున్నందున నవంబర్ 6తో ముగియనున్న గడువును పొడిగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. కార్యక్రమంలో నాగెల్లి వెంకటనారాయణ, సంపంగి సాలయ్య, కందికొండ సంధ్య, పెండెం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

