ట్రాఫిక్ నియమాలతోనే సురక్షిత ప్రయాణం
హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరి… నిర్లక్ష్యం ప్రాణాంతకం
అరైవ్ అలైవ్ ద్వారా ప్రజల్లో చైతన్యం పెంపు
డీసీపీ ప్రభాకర్ రావు పిలుపు
వినూత్న అవగాహనతో ఆకట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు
కాకతీయ, హనుమకొండ : రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు పిలుపునిచ్చారు. కాజీపేట ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా సుబేదారి అదాలత్ సెంటర్లో వినూత్న అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు చైతన్యం కల్పించేందుకు కానిస్టేబుళ్లు యమధర్మరాజు, చిత్రగుప్తుడి వేషధారణలో రహదారులపై ప్రచారం చేపట్టారు. ఈ వినూత్న ప్రదర్శన వాహనదారుల దృష్టిని ఆకర్షిస్తూ ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను సులభంగా తెలియజేసింది.
నిబంధనలు పాటిస్తేనే ప్రాణ రక్షణ
ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు క్షణాల్లో ప్రాణ నష్టం కలిగించే ప్రమాదకర సంఘటనలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వాహనం నడపడంతో పాటు ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడం ప్రధాన లక్ష్యమని, అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి ప్రమాదాలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ఈ లక్ష్యం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకన్నతో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

