కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో గల్లీల్లో సీసీ రోడ్ల నిర్మాణం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి చొరవతో ముందుకు
ఆత్మకూరు సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు
అన్ని రంగాల్లో మండల కేంద్రాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడి
కాకతీయ, ఆత్మకూరు: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోనే గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి సాధ్యమని ఆత్మకూర్ సర్పంచ్ పర్వతగిరి మహేశ్వరి రాజు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కాలనీల్లోని గల్లీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా ఇబ్బందులను తొలగించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాలకు నిధులు మంజూరు చేస్తున్నారని, ఆయన సహకారంతో ఆత్మకూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ పాలకవర్గం అహర్నిశలు శ్రమిస్తుందని వివరించారు. ఎమ్మెల్యే సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు తనుగుల సందీప్ మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

