విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద
రాయపర్తి సాంఘిక సంక్షేమ గురుకులంలో ప్రతిభా వారోత్సవాలు
సృజనాత్మకతతో మెరిసిన విద్యార్థులు..
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
కాకతీయ, రాయపర్తి: సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాలలో మంగళవారం విద్యార్థుల ప్రతిభా వారోత్సవాలు అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించారు. విద్యార్థుల్లోని దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేలా సాగిన ఈ కార్యక్రమానికి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన చిత్రలేఖనం, హస్తకళల ప్రదర్శనను కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వీధి నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. పాఠశాల ప్రాంగణం, వసతి గృహం మరియు భోజనశాలను స్వయంగా తనిఖీ చేసిన కలెక్టర్, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మెను ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
లక్ష్యం వైపు సాగాలి..
సభను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సృజనాత్మక రంగాల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ గురుకులాల్లో కల్పిస్తున్న అత్యాధునిక వసతులను సద్వినియోగం చేసుకుని, కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేదా ఇబ్బందులు తలెత్తకుండా ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పుష్పలత, గురుకులం ప్రిన్సిపాల్ సముద్రాల సరిత, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

