పౌష్టికాహారంతోనే రక్తహీనతకు చెక్
గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం
వేడుకగా సామూహిక సీమంతాలు, అన్నప్రాసనలు
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
కాకతీయ, హనుమకొండ: గర్భిణీలు, బాలింతలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ పౌష్టికాహారం తీసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సూచించారు. ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం ‘పోషణ్ పక్వాడ’ ముగింపు వేడుకలు కలెక్టరేట్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా గర్భిణీలకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించారు. అంగన్‌వాడీ చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్వహించిన ‘గ్రాడ్యుయేషన్’ వేడుకలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.
రెండేళ్ల వరకు అత్యంత కీలకం
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గర్భధారణ సమయం నుంచి బిడ్డకు రెండేళ్లు వచ్చే వరకు తల్లి ఆరోగ్యం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ దశలో సరైన పోషకాలు అందకపోతే రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయని, అవి తల్లి బిడ్డల ప్రాణాలకు ఇబ్బందిగా మారుతాయని హెచ్చరించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలని కోరారు. జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలకు అంగన్‌వాడీల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం, ఇతర ఆరోగ్య సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో జీసీడీఓ సునీత, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ సుమలత, ఆయుష్ జిల్లా ఇంచార్జ్ డాక్టర్ మహేందర్ కుమార్, డీపీఎం డాక్టర్ భాను ప్రకాష్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రుబీనా, డెమో అశోక్ రెడ్డి, మెప్మా డీఎంసీ రజిత రాణి, ఎఫ్‌ఆర్ఓ రవికృష్ణ, అంగన్‌వాడీ సిబ్బంది మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

