మక్క రైతులకు మార్కెట్లో ‘చుక్కలు’
ఏనుమాములలో ఆగని అవస్థలు!
బార్దాన్లు లేక రెండు రోజులుగా నిలిచిన కాంటాలు
ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌లో ‘కర్షక’ రోదన
గోదాముల్లో దిగుమతి జాప్యం.. యార్డుల్లోనే రైతుల జాగారం
వర్షం వస్తే గతేంటని రైతుల ఆందోళన
టార్పాలిన్లు ఉన్నాయంటూ సరిపెడుతున్న అధికారులు
ప్రభుత్వ ప్రకటనలు కోటలు దాటుతున్నా.. క్షేత్రస్థాయిలో కష్టాలు తీరని వైనం
కాకతీయ, వరంగల్: రైతులకు కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు ఊదరగొడుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మారుతున్నాయి. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌గా పేరుగాంచిన ఏనుమాములలో మక్క రైతుల పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది. అధికారులు, పాలకుల సమన్వయ లోపంతో రైతులు కంటిమీద కునుకు లేకుండా మార్కెట్ యార్డుల్లోనే పడిగాపులు కాస్తున్నారు. ఏనుమాముల మార్కెట్‌లో గత రెండు రోజులుగా బార్దాన్ల (గోనె సంచులు) కొరత తీవ్రంగా వేధిస్తోంది. మార్క్ ఫెడ్ అధికారులు సకాలంలో బార్దాన్లు సరఫరా చేయకపోవడంతో కాంటాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆరబోసిన మక్కలు యార్డుల్లోనే పేరుకుపోవడంతో, అకాల వర్షం ఎప్పుడు ముంచుకొస్తుందోనని రైతులు ప్రాణసంకటంలో ఉన్నారు. రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, కనీసం నిద్రపోయేందుకు కూడా వీలులేకుండా మక్కలను కాపాడుకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోదాముల్లో దిగుమతి జాప్యం..
మరోవైపు, కాంటాలు పూర్తయిన మక్కలను గోదాములకు తరలించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. గోదాముల్లో దిగుమతి ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో అటు కొనుగోళ్లపై కూడా ఆ ప్రభావం పడుతోంది. అస్తవ్యస్తంగా మారిన ఈ వ్యవస్థతో రైతులు అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. మార్కెట్ అధికారుల పర్యవేక్షణ లోపమే ఈ దుస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అంగీకరించిన మార్కెట్ కార్యదర్శి..
బార్దాన్ల కొరత ఉన్న మాట వాస్తవమేనని ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి ఆర్. మల్లేశం వెల్లడించారు. గోదాముల్లో దిగుమతి కూడా ఆలస్యంగానే జరుగుతోందని ఆయన అంగీకరించారు. అయితే, వర్షం వస్తే మక్కలు తడవకుండా ఉండేందుకు సుమారు 800 టార్పాలిన్లను అందుబాటులో ఉంచామని, రైతులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అధికారులు కేవలం టార్పాలిన్లతో సరిపెట్టకుండా, తక్షణమే బార్దాన్లు తెప్పించి కాంటాలు ప్రారంభించాలని మక్క రైతులు డిమాండ్ చేస్తున్నారు.

