అభివృద్ధికి జనాభా గణనే ప్రాతిపదిక
ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి
నర్సంపేట తహసీల్దార్ రవి చంద్రా రెడ్డి
కాకతీయ, నర్సంపేట: దేశ అభివృద్ధిలో జనాభా గణన కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ స్వీయ గణనకు ముందుకు రావాలని నర్సంపేట తహసీల్దార్ రవి చంద్రా రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్యూమరేటర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఖచ్చితమైన జనాభా లెక్కల ఆధారంగానే ప్రభుత్వం ప్రజల అవసరాలను అంచనా వేసి, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయగలదని వివరించారు. గణన ద్వారా లభించే సమాచారం విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనకు సరైన ప్రణాళికలు రూపొందించేందుకు దోహదపడుతుందని తహసీల్దార్ పేర్కొన్నారు. ఇంటింటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించి, అడిగిన వివరాలను నిజాయితీగా అందించాలని సూచించారు. ప్రతి కుటుంబం దీనిని ఒక సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలయి శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ పరిపాలన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

