హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాలలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
జెండా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే
కాకతీయ, పరకాల: ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం పరకాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా పుట్టిన గులాబీ జెండా, నేడు తెలంగాణ అభివృద్ధికి నిదర్శనమని ధర్మారెడ్డి పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు, అనేక సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని గుర్తుచేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఐక్యతతో కృషి చేయాలని, నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ధరల పెరుగుదల, నిరుద్యోగిత, సంక్షేమ పథకాల అమలులో జాప్యం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన ఆరోపించారు. రైతులకు మద్దతు కరువైందని, పరిపాలనలో అయోమయం నెలకొందని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో ప్రజలు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువత మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

