కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగొద్దు
ఇందిరమ్మ ఇళ్లను వెంటనే పూర్తి చేయాలి
జూన్ 2 నాటికి గృహప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలి
అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం
కాకతీయ, హనుమకొండ: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, ఎక్కడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఎల్కతుర్తిలో మంగళవారం నిర్వహించిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ మండల స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేసవి నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని మంత్రి సూచించారు. మిషన్ భగీరథ నీరు అందని చోట బావులను అద్దెకు తీసుకుని అయినా నీటిని సరఫరా చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఇసుక కొరత రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని కోరారు. జూన్ 2వ తేదీ నాటికి గరిష్టంగా గృహప్రవేశాలు జరిగేలా లక్ష్యంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఆయిల్ పామ్ సాగుపై అవగాహన..
ఉద్యానవన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని, ముఖ్యంగా ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే లాభాలపై విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. ఉపాధి హామీ పనులను గడువులోగా పూర్తి చేయాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేలా మహిళా సంఘాల ద్వారా స్టీల్ ప్లేట్లు, గ్లాసుల వాడకాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు, వర్షాకాలం నాటికి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
13 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు..
అదనపు కలెక్టర్ ఎన్. రవి మాట్లాడుతూ.. ఎల్కతుర్తి మండలంలో 13 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, కొన్న వెంటనే మిల్లులకు తరలిస్తున్నామని వివరించారు. ఎంపీడీవో విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ సంతాజీ, ఆర్టీఓ రాథోడ్ రమేష్, జడ్పీ సీఈవో శేషాద్రి, డీఆర్డీఓ శ్రీను, డీపీఓ లక్ష్మీ రమాకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.

