నీట్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని సీపీ ఆదేశం
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 11 పరీక్ష కేంద్రాలు
కాకతీయ, హనుమకొండ : మెడికల్ ప్రవేశ పరీక్ష ‘నీట్’ ను సజావుగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెక్షన్ 163 బి ఎన్ ఎస్ ఎస్ (పాత 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 11 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. హనుమకొండలో 4, వరంగల్‌లో 2, కాజీపేటలో 3, జనగామలో 2 కేంద్రాలు ఉన్నాయి. మే 3న (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సీపీ వివరించారు. పరీక్ష కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ సెంటర్లు ఆదివారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడరాదని, సభలు, ర్యాలీలు, ధర్నాలపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి కేంద్రం వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

