రైతు నోట్లో మట్టి కొడుతున్న సర్కార్
రైతు భరోసా లేదు.. బోనస్ జాడ లేదు
6న వరంగల్ రైతు సభకు కేటీఆర్ హాజరు
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజం
కాకతీయ, రాయపర్తి: రైతును రాజు చేస్తామని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. నేడు అన్నదాతల నోట్లో మట్టి కొడుతోందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. శనివారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. రైతు భరోసా ఇవ్వకుండా, బోనస్ ప్రకటించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఎర్రబెల్లి మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “మక్కల కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులు లేవని, లారీలు రావడం లేదని సాకులు చెబుతూ రైతుల పొట్ట కొడుతున్నారు. పండించిన పంట అమ్ముకోవడానికి వచ్చిన రైతు కళ్లలో కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుంది” అని హెచ్చరించారు.
వరంగల్ వేదికగా సమరశంఖం
కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ‘రైతు డిక్లరేషన్’ ప్రకటించిందో.. అదే వరంగల్ గడ్డపై బీఆర్ఎస్ సమరశంఖం పూరించనుందని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈనెల 6న వరంగల్‌లో నిర్వహించబోయే భారీ రైతు సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని తెలిపారు. ఈ సభకు ప్రతి గ్రామం, తండా నుంచి ప్రజలు, మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మూనావత్ నరసింహా నాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

