లక్షలు.. కోట్లే!
బల్దియా ఆఖరి మీటింగ్ లో కాసుల గలగలలే!
అన్నపూర్ణమ్మగా.. రూ.5 భోజనం బిల్లులకు మేయర్ వరాలు
ఈ ఏడాది సెప్టెంబర్ వరకు బిల్లులకు మోక్షం
అభివృద్ధి పనులకు కోట్లకుపైగా నిధులు
కొత్త పనులకు ఆఫీసు ఆవరణలోనే బండరాళ్లు
కూర్చోవడంలో ప్రొటోకాల్ పై నెలకొన్న వివాదం
నేమ్ ప్లేట్లు పెట్టలేదని ఎమ్మెల్సీ బస్వరాజు అసహనం
సాదాసీదాగా సాగిన జీడబ్ల్యుఎంసీ కౌన్సిల్ చివరి సమ్మేళనం
ఎప్పటిలాగే మీడియాకు ముఖం చాటేసిన మేయర్ సుధారాణి
కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ పాలకవర్గ చివరి సమావేశం చిన్నచిన్న పొరపాట్ల మధ్య సజావుగానే ముగిసింది. ఎప్పటిలాగే సాదాసీదాగా కొనసాగింది. గుండు సుధారాణి మేయర్‌గా కొలువుదీరిన పాలకవర్గం కాలపరిమితి బుధవారంతోనే ముగిసింది. ఇదే రోజున బల్దియా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ప్రతీ సమావేశం సమయంలో మాదిరిగానే ఈ సారి సమావేశంలో కొన్ని పొరపాట్లు చోటుచేసుకోవడం సహజమే అయినా ఎక్స్ అఫిషియో మెంబర్లలో అసహనానికి దారితీసింది. సమావేశంలో లక్షలు, కోట్ల రూపాయల నిధులు వెచ్చింపునకు సభ చప్పట్లు కొట్టింది. ఆఖరి సమావేశం కావడంతో గొప్పలకు కొప్పులు వేసినట్లుగా సాగినట్లు తెలుస్తోంది. ఒకరికొకరు ప్రశంసలతో ముంచెత్తుకున్నట్లు సమాచారం. ఇక ఎప్పటిలాగే సమావేశం ముగిసిన తర్వాత ఈ సారైనా మేడమ్ మేయర్ గుండు సుధారాణి మీడియా ముందుకు వస్తారనుకుంటే నిరాశే మిగిలింది. కొందరు మీడియా ప్రతినిధులు ఆఖరి మీటింగ్ విశేషాలు చెప్పాలని కోరినా.. మేయర్ ముఖం చాటేయడం విస్మయానికి గురిచేసింది.

అన్నపూర్ణమ్మగా మేయర్ సుధారాణి..
అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదంటారు.. అన్నట్లుగానే మేయర్ సుధారాణి చివరి మీటింగ్ లో అమ్మ పాత్ర పోషించారా? అన్న రీతిలో వ్యవహరించారు. రూ.5ల బోజనానికి అన్నపూర్ణ స్కీంకు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బిల్లులు చెల్లించేలా సమావేశం ఆమోదానికి పెట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వాస్తవానికి ఆమె పదవీకాలం బుధవారంతో ముగిసిపోయింది. చివరి సమావేశం కావడంతో ఈనాటి వరకు ఏమైనా బిల్లులు పెండింగ్ ఉంటే ఆమోదించేందుకు ప్రయత్నం చేస్తారని అంతా భావించారు. కానీ, ఎవరూ ఊహించనంతగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టడం మేడమ్ అమ్మగుణం తొణికిసలాడిందా? అనే చర్చకు దారితీసింది. దాదాపు రూ.5కోట్లకుపైగా బిల్లులు అన్నపూర్ణ స్కీంకు చెల్లించే నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఒక్కో పనికి కోటి, అర కోటి!
నగరంలో పలు అభివృద్ధి పనుల చేపట్టాలని మేయర్ ప్రతిపాదించారు. ఒక్కో పనికి కోటి.. అరకోటి అంచనాలతో పనులకు నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పనులకు సమావేశం చప్పట్లతో ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న పలు పనులకు కూడా బిల్లులు చెల్లించే ప్రతిపాదనలకు సైతం సమావేశం సంతోషంగా ఆమోదం పలికినట్లు సమాచారం. మొత్తంగా ప్రజా సమస్యలను పక్కనపెట్టి.. కేవలం నిధులు, పనులపైనే దృష్టి సారించినట్లు సమావేశం తీరు స్పష్టం చేస్తోంది.
ఎమ్మెల్సీ బస్వరాజు ఎక్కడ కూర్చోవాలి!
ఇప్పటివరకు జరిగిన అన్ని సమావేశాల్లో ఎవరు ఎక్కడ కూర్చుకోవాలో తెలిపేలా టేబుళ్లపై సభ్యుల నేమ్ ప్లేట్లు అమర్చే వారు. కానీ, ఈసారి ఆ ఏర్పాట్లు చేయడంలో అధికారులు చేతులెత్తేశారు. దీంతో సమావేశం మందిరంలోకి అడుగుపెట్టిన ఎక్స్అఫీషియో మెంబర్, ఎమ్మెల్సీ బస్వరాజు.. తను ఎక్కడ కూర్చోవాలనే సంశయంతో అధికారుల తీరుపై మండిపడ్డారు. బస్వరాజు తీరుతో నాలుక కర్చుకున్న అధికారులు అప్పటికప్పుడు నేమ్ ప్లేట్లు సర్దిపెట్టడంతో వివాదం అంతటితో ముగిసింది.
నవ్వులు.. చప్పట్లు!
సమావేశం చివరిది కావడంతో అంతా సజావుగానే సాగింది. ఎవరికీ వారు గొప్పలు చెప్పుకోవడం, చప్పట్లు కొట్టడం, నవ్వులు చిందించడం, ఆఖరుకు అన్ని ప్రతిపాదనలకు సై అనడం వరకే సమావేశం పరిమితమైనట్లు తెలుస్తోంది. ఎక్స్ అఫిషియో మెంబర్లు సభ్యులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపినట్లు తెలిసింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ పదవీ కాలం ముగిసినా సభ్యులు మాత్రం ప్రజా సేవలో కొనసాగాలని సూచించినట్లు సమాచారం. మిగతా ఎక్స్ అఫిషియో సభ్యులు సైతం సభ్యులకు భవిష్యత్ పై పలు సూచనలు, సలహాలు అందించినట్లు పలువురు కార్పొరేటర్లు పేర్కొన్నారు.
మాటైనా మాట్లాడని మేయర్!
చివరి సమావేశం కావడంతో మేయర్ గుండు సుధారాణి మీడియాతో తన అనుభవాలను పంచుకుంటారని మీడియా మొత్తం భావించింది. ఇప్పటివరకు జరిగిన అన్ని సమావేశాల సందర్భంలోనూ మేయర్ ఏనాడూ మీడియా ముందుకు రాలేదు. సమావేశ వివరాలను వెల్లడించలేదు. ఎప్పటికి ఎక్స్ అఫిషియో సభ్యులే సమావేశం గురించి వివరించే వారు. చివరి సమావేశం కావడంతో మేయర్ మాట్లాడతారనుకుంటే.. ఆమె ముఖం చాటేయడం మీడియా ప్రతినిధులను నిరాశకు గురి చేసింది.

