ఆలయాలను కూల్చి చరిత్ర హీనులయ్యారు
ఘటనపై తక్షణ విచారణ జరపాలి
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
అశోక్‌నగర్‌లో కాకతీయుల కాలం నాటి శివాలయ విధ్వంసంపై ఆగ్రహం
కాకతీయ, ఖానాపురం: నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపురం మండలం అశోక్‌నగర్ గ్రామంలో కాకతీయుల కాలానికి చెందిన చారిత్రక శివాలయాన్ని ధ్వంసం చేయడంపై నర్సంపేట మాజీ శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ధ్వంసమైన ఆలయ స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘోర ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తక్షణమే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. చరిత్రహీనులు మాత్రమే ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడతారని మండిపడ్డారు. కాకతీయుల వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ చారిత్రక ఆలయం ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిందని, అభివృద్ధి పేరుతో చారిత్రక కట్టడాలను కూల్చివేయడం అవివేకమని ధ్వజమెత్తారు.
కమిషన్ల కోసమే కూల్చివేతలు
క్రీ.శ. 1213 కాలంలో నిర్మించిన ఈ ఆలయాన్ని అర్ధరాత్రి వేళ కూల్చివేస్తుంటే పురావస్తు శాఖ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఈ స్థలాన్ని ఉపయోగించాలనుకున్నా, ఆలయ ప్రాధాన్యతను గుర్తించి వెనక్కి తగ్గాయని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ల లాభాలు, స్థానిక నాయకుల కమిషన్ల కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. ఈ కుట్ర వెనుక ఉన్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ రామస్వామి నాయక్, నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కలపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు వెంకట నారాయణ, కౌన్సిలర్లు, మండల నాయకులు పాల్గొన్నారు.

