ఏనుమాముల మార్కెట్‌లో భారీ మోసం
రూ. 2.50 కోట్లతో వ్యాపారి పరార్
కాకతీయ, వరంగల్: ఆసియాలోనే అతి పెద్దదైన వ్యవసాయ మార్కెట్లలో ఒకటైన వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో భారీ మోసం వెలుగుచూసింది. వ్యాపార లావాదేవీల పేరుతో తోటి వ్యాపారులను నమ్మించి, సుమారు రూ. 2.50 కోట్లతో ఒక వ్యాపారి తన కుటుంబంతో సహా పరారయ్యాడు. బాధితుడు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది.
వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో శ్రీవిద్య ట్రేడింగ్ ఫోరం పేరుతో ఖరీదు లైసెన్స్ పొందిన ఐలయ్య (అలియాస్ అరుణ్) అనే వ్యాపారి, ఇతర కమిషన్ వ్యాపారుల వద్ద పెద్ద మొత్తంలో మిర్చి సరుకును కొనుగోలు చేశాడు. ఈ క్రమంలోనే మోక్ష ఎంటర్‌ప్రైజెస్ యజమాని పోటు వినయ్ కుమార్ వద్ద గత ఏప్రిల్ నెలలో విడతల వారీగా సుమారు రూ. 33,81,011 విలువైన మిర్చిని కొనుగోలు చేశాడు.
సరుకుకు సంబంధించి ఐలయ్య ఇచ్చిన చెక్కులు బ్యాంకులో బౌన్స్ అయ్యాయి. బాకీ ఉన్న సొమ్ము చెల్లించాలని వినయ్ కుమార్ ఒత్తిడి చేయగా, నిందితుడు ముందస్తు ప్లాన్ ప్రకారం తన కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. ఈ నెల 6వ తేదీ నుండి ఐలయ్య తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకపోవడంతో, మోసపోయానని గ్రహించిన బాధితుడు ఏనుమాముల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు వినయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఏనుమాముల సిఐ శివాజీ సురేష్ తెలిపారు. ప్రధాన నిందితుడు ఐలయ్యతో పాటు అతని కుటుంబ సభ్యులైన శోభ, నాగరాజు, మానస మరియు సందీప్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం వినయ్ కుమారే కాకుండా, మార్కెట్‌లోని ఇతర వ్యాపారులను కూడా నమ్మించి ఐలయ్య మొత్తం రూ. 2.50 కోట్ల వరకు వసూలు చేసినట్లు ప్రాథమిక సమాచారం. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

